ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తల్లి... బాత్రూమ్ లో శవమై కనిపించగా... అతని తండ్రి కనిపించకుండా పోయాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... బెంగళూరుకి చెందిన అభిషేక్... ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

కాగా.. అతనికి తల్లి మంజుల(52), తండ్రి దొడ్డె గౌడ ఉన్నారు. అభిషేక్ తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నాడు. కాగా.. శుక్రవారం సాయంత్రం.. నైట్ షిఫ్ట్ నేపథ్యంలో... అభిషేక్ ఆఫీసుకు వెళ్లాడు. ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో ఎవరూ కనిపించలేదు. తల్లి ఫోన్ కి కాల్ చేయగా... స్విచ్ఛాప్ వచ్చింది. వెంటనే తండ్రి నెంబర్ కి ఫోన్ చేసినా కలవలేదు. 

వెంటనే ఇంట్లో మరోసారి వెతకగా... అతని తల్లి మంజుల బాత్రూమ్ లో రక్తపు మడుగులో కనిపించింది. తండ్రి కోసం వెతకగా... అతని ఆచూకీ లభించలేదు. చుట్టుపక్కల వారి సహాయంతో తల్లిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తేల్చి చెప్పారు. ఆమె గాయాలపాలవ్వడానికి ముందు తండ్రితో ఘర్షణ జరిగినట్లు అభిషేక్ అనుమానం వ్యక్తం చేశాడు. తన తల్లి గాజులు ముక్కలుగా ఇంట్లో పడి ఉన్నాయని అతను చెప్పాడు. ముక్కు, నోరు మీద దాడి చేయడం వల్లే ఆమె చనిపోయినట్లు వైద్యులు చెప్పారు.

అభిషేక్ తండ్రి దొడ్డె గౌడ మీద అనుమానం వ్యక్తం చేస్తూ... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.