బెంగళూరులో ఆదివారం రాత్రి కురిసిన వర్షం.. నగరంలోని అనేక ప్రాంతాలను జలదిగ్భందంలోకి నెట్టేసింది. సోమవారం కూడా కొన్ని గంటల పాటు భారీ వర్షం కురిసింది. దీంతో బెంగళూరు నగరంలోని చాలా ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు కనిపిస్తుంది. 

బెంగళూరులో ఆదివారం రాత్రి కురిసిన వర్షం.. నగరంలోని అనేక ప్రాంతాలను జలదిగ్భందంలోకి నెట్టేసింది. సోమవారం కూడా కొన్ని గంటల పాటు భారీ వర్షం కురిసింది. దీంతో బెంగళూరు నగరంలోని చాలా ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని దాదాపు 75 ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో మొత్తంగా 2 వేల ఇళ్ల వరకు ముంపుకు గురయ్యాయి. ఇళ్లలోకి వరదనీరు చేరి ఇబ్బందులు పడుతున్న ప్రజలను సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అపార్టుమెంట్లు, భారీ భవనాల బేస్‌మెంట్లలో, ఇళ్ల ముందు పార్కు చేసిన వాహనాలు నీటిలో మునిగిపోయాయి. భారీ వరదలతో 20,000 వాహనాలు దెబ్బతిన్నట్టుగా సమాచారం. ఇక, వారంలోనే రెండోసారి కుండపోత వర్షం పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

సోమవారం రాత్రి పౌండ్ నల్లూరు, వర్తూరు జంక్షన్, బెల్లందూరు, పానత్తూరులో మరోసారి భారీ వర్షం కురవడంతో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. బెంగళూరులో 75 ఏళ్లలో సెప్టెంబరు నెలలో కురిసిన మూడో అత్యధిక వర్షపాతం ఇదేనని చెబుతున్నారు. భారత వాతావరణ విభాగం శాస్త్రవేత్తల ప్రకారం.. బెంగళూరులో ఆదివారం రాత్రి కేవలం 12 గంటలలోపే.. 13.16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గతంలో సెప్టెంబర్ నెలలో నమోదైన అత్యధిక వర్షపాతం విషయానికి వస్తే.. 1988లో 18 సెం.మీ, 2014లో 13.23 సెం.మీగా ఉంది. 

బెల్లందూర్, యెమలూరు, కోరమంగళ, హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్, హెచ్‌ఏఎల్ II స్టేజ్, ఇందిరానగర్, హెచ్‌బీఆర్ లేఅవుట్, మాన్యతా టెక్ పార్క్ వంటి అనేక ప్రముఖ ప్రాంతాలను వర్షపు నీరు ముంచెత్తింది. స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో.. వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఎయిర్ బోట్స్, ట్రాక్టర్లు అందుబాటులో ఉంచారు. కొన్ని ప్రాంతాల్లో నాలుగు నుంచి ఐదు అడుగుల వరకు నీరు చేరడంతో.. వారికి ఇతర ప్రాంతాలతో సంబంధాలు దెబ్బతిన్నాయి. 

కొన్నిచోట్ల బైక్‌లు, కారులో వరద నీటిలో కొట్టుకుపోయాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో.. అనేక మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరద నీటిలో వాహనాలతో వెళ్తున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుల్తాన్‌పేట వద్ద వరదనీరు ఉన్న రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఆర్ గణేష్ అనే దినసరి కూలీ మ్యాన్‌హోల్‌లోకి జారిపడ్డాడు. స్థానికులు అతడిని బయటకు తీసే సమయానికి మృతి చెందాడు.

మహదేవపుర, యలహంక, బొమ్మనహళ్లి ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆర్‌ఎంజెడ్ ఎకోస్పేస్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డులో భారీగా వరద నీరు వచ్చి చేరింది. మున్నెకొలలు, బెల్లందూర్‌లోని బస్తీ పట్టణాల్లో దాదాపు 1,500 టిన్‌ షెడ్‌ ఇళ్లు నీట మునిగాయి.

30 మంది సభ్యులతో కూడిన రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను తీవ్రంగా ప్రభావితమైన కోరమంగళ, ఇందిరానగర్, సర్జాపూర్‌లోని రెయిన్‌బో డ్రైవ్ లేఅవుట్, మారతహళ్లి ప్రాంతాల్లో రంగంలోకి దింగారు. ఆ ప్రాంతాల్లో ఇళ్లలో చిక్కుకుపోయిన వారిని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. 

ఇక, మాండ్యా జిల్లాలోని మలవల్లి తాలూకాలోని బెంగుళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ పంపింగ్ స్టేషన్లలో కూడా 13 నుంచి 15 అడుగుల నీరు ఉండటంతో బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాలకు రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది. ఈ పరిస్ధితుల నేపథ్యంలో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై సోమవారం తన షెడ్యూల్ సమావేశాలన్నింటినీ రద్దు చేసుకకున్నారు. వెంటనే బెంగళూరు నగరానికి 100 కిలోమీటర్ల దూరంలోని మలవల్లి తాలూకాలోని తొరేకాడనహళ్లికి వెళ్లారు. అక్కడ నీటి మునిగిన కావేరి నీటి పంపింగ్ స్టేషన్‌ను పరిశీలించారు. 

కర్ణాటక రాష్ట్ర సహజ విపత్తు పర్యవేక్షణ కేంద్రం ప్రకారం.. వైట్‌ఫీల్డ్‌లో అత్యధికంగా 17.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. దాదాపు 15 ప్రాంతాల్లో, ముఖ్యంగా తూర్పు, మహదేవపుర జోన్లతో పాటు.. దక్షిణ బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో ఎనిమిది గంటలలోపే 10 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.