సారాంశం

బెంగళూరులో భారీ సైబర్‌ దోపిడి వెలుగులోకి వచ్చింది. పెట్టుబడి పేరుతో అధిక లాభాల్ని ఆశచూపిన సైబర్‌ నేరస్థులు దేశవ్యాప్తంగా వేలాది మంది నుంచి రూ.854 కోట్లను దోచుకున్నారు. ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేశారు, వారి నుంచి రూ.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. 

బెంగళూరులో భారీ సైబర్‌ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. సులభంగా డబ్బు సంపాదించవచ్చని ఆశచూపారు సైబర్‌ నేరస్థులు. దేశవ్యాప్తంగా  ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా  రూ.854 కోట్లను దోచుకున్నారు. ఈ సైబర్ క్రైమ్ లో ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు బెంగళూరు పోలీసులు. రూ.854 కోట్ల విలువైన సైబర్ ఇన్వెస్ట్‌మెంట్ మోసాన్ని బెంగళూరు పోలీసులు బట్టబయలు చేయడంలో విజయం సాధించారు.

ఈ కేసులో ఆరుగురిని కూడా అరెస్టు చేశారు. అరెస్టయిన నేరస్థులు దేశవ్యాప్తంగా వేలాది మందిని మోసగించినట్లు ఆరోపణలు ఉన్నాయని బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ దయానంద  శనివారం తెలిపారు. అరెస్టయిన నిందితులందరూ బెంగళూరు వాసులు. వారిని మనోజ్, పణీంద్ర, చక్రధర్, శ్రీనివాస్, సోమశేఖర్, వసంత్‌లుగా గుర్తించారు. ఈ కేసులో మరో ముగ్గురిని గుర్తించారు. ఈ మోసానికి వారే సూత్రధారిగా భావిస్తున్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

పోలీసులు విచారణ ప్రారంభించగా.. దేశవ్యాప్తంగా ఐదు వేలకు పైగా ఇలాంటి మోసం కేసులు నమోదైనట్లు వెలుగులోకి వచ్చింది. ఇందులో బెంగళూరులోనే 17 కేసులు నమోదయ్యాయి. 5 కోట్లను ఫ్రీజ్ చేయడంలో విజయం సాధించినట్లు పోలీసులు తెలిపారు. ఒక్క బెంగళూరులోనే రూ.49 లక్షలు మోసం చేశారు. నిందితులతో సంబంధం ఉన్న ముఠా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రజలను ఎరగా వేసేవారు. మొదట్లో రూ.1000 నుంచి రూ.10,000 వరకు పెట్టుబడి పెట్టాలని కోరారు. దీనిపై రోజుకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు లాభాన్ని అందజేస్తున్నామన్నారు. ఎక్కువ లాభం పొందాలనే దురాశతో వేలాది మంది ముఠా వలలో పడి నిందితులు చెప్పిన ఖాతాలకు రూ.1 లక్ష నుంచి 10 లక్షల వరకు బదిలీ చేశారు.