బెంగళూరులో కార్‌పూలింగ్‌పై నిషేధం లేదు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి రామలింగా రెడ్డి.. ఇంతకీ ఏం జరిగిందంటే..
బెంగళూరులో కార్‌పూలింగ్‌పై నిషేధం విధించారనే వార్తలపై కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి స్పందించారు. కార్‌పూలింగ్‌పై నిషేధం లేదని ఆయన స్పష్టం చేశారు.

బెంగళూరులో కార్‌పూలింగ్‌పై నిషేధం విధించారనే వార్తలపై కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి స్పందించారు. కార్‌పూలింగ్‌పై నిషేధం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ కార్‌పూలింగ్ ఆపరేట్ చేయడానికి చట్టపరమైన అనుమతులు అవసరమని అన్నారు. చట్టబద్ధంగా పనిచేయడానికి అవసరమైన అనుమతులను తప్పనిసరిగా పొందాల్సిందేనని చెప్పారు. పర్మిషన్ తీసుకోకుండానే.. నిషేధం అంటే ఎలా అని ప్రశ్నించారు. ఎవరైనా రూల్స్, రెగ్యులేషన్స్ పాటించాల్సిందేనని అన్నారు. పసుపు కలర్ నెంబర్ ప్లేట్‌తో ఉన్నవారు వాహనాలు నడుపుకోవచ్చని చెప్పారు. ప్రస్తుతం తాము నిషేధం విధించలేదని.. పర్మిషన్ తీసుకోవాలని చెప్పామని అన్నారు. రేపు ఇందుకు సంబంధించి సమావేశం నిర్వహించనున్నట్టుగా తెలిపారు.
అయితే చట్టవిరుద్దంగా పనిచేస్తున్న కార్‌పూలింగ్ యాప్‌ల కార్యకలాపాలను నిలిపివేయాలని టాక్సీ, ఆటో అసోసియేషన్‌లు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కర్ణాటక రవాణా శాఖ.. వాణిజ్య ప్రయాణ ప్రయోజనాల కోసం వైట్‌బోర్డ్ వాహనాలను ఉపయోగించడం చట్టవిరుద్ధం అని పేర్కొంది. వైట్ నంబర్ ప్లేట్ ఉన్న కార్లను ఎవరైనా కార్‌పూలింగ్ సేవలను నిర్వహిస్తున్నట్లు తేలితే రూ. 5,000 నుంచి రూ. 10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈ నిర్ణయంపై పలువురు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కారుపూలింగ్‌పై నిషేధంపై మంత్రి రామలింగారెడ్డి స్పందించారు. ఇక, ఈ అంశంపై తదుపరి చర్చల కోసం రామలింగారెడ్డి రేపు ఉదయం 10 గంటలకు కార్‌పూల్ యాప్ అగ్రిగేటర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
కార్‌పూలింగ్ అంటే..
ట్రాఫిక్‌ని తగ్గించడానికి కార్‌పూలింగ్ ఆప్షన్‌ని ఎంచుకోవాలనే డిమాండ్ వినిపిస్తుంది. ఒకే ఆఫీస్‌కి వెళ్లే ఉద్యోగులంతా ఒకే కార్‌లో వెళ్లాలనేదే కార్‌పూలింగ్. రద్దీ సమయాల్లో బెంగళూరు రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో కార్‌పూలింగ్ ఒక ముఖ్యమైన అంశంగా పరిగణించబడింది. అనేక మంది ఐటీ ఉద్యోగులు తమ ఇంటి నుంచి ఆఫీసులకు రాకపోకలు సాగించేందుకు ఈ సేవలపై ఆధారపడుతున్నారు.
అయితే ఇటీవల, టాక్సీ సంఘాలు కార్‌పూలింగ్ సేవలు తమ రోజువారీ ఆదాయాన్ని ప్రభావితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సమస్యను పరిష్కరించాలని అధికారికంగా ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. అదనంగా, ఆటోరిక్షా డ్రైవర్ల యూనియన్‌తో పాటు ట్యాక్సీ సంఘాలు బెంగళూరు బంద్ నిర్వహించి కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డికి డిమాండ్లను తెలియజేశాయి. ఆటోరిక్షా డ్రైవర్లు పెట్టే డిమాండ్లలో బైక్ టాక్సీలను నిషేధించడం ముఖ్యమైనదిగా ఉంది.