Asianet News TeluguAsianet News Telugu

భారీ వ‌ర్షాల‌తో బెంగ‌ళూరు అత‌లాకుత‌లం.. కేర‌ళలోనూ వాన‌లు ప‌డే ఛాన్స్, రెడ్ అలెర్ట్ ప్ర‌క‌టించిన ఐఎండీ

బెంగళూరు సిటీలో కురిసిన వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. వరదలతో నగరం అంతా అతలాకుతలం అయ్యింది. నగరవాసులు తీవ్రంగా ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. అయితే కేరళ, తమిళనాడులోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. 

Bengaluru hit by heavy rains, chance of rains in Kerala too, IMD announces red alert
Author
First Published Sep 6, 2022, 11:26 AM IST

సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాను భారీ వ‌ర్షాలు అత‌లాకుత‌లం చేస్తున్నాయి. కుండ‌పోత వాన‌ల కార‌ణంగా బెంగ‌ళూరు సిటీలో రోడ్ల‌పై విప‌రీతంగా నీరు నిలిచిపోయింది. అపార్ట్‌మెంట్లు, ఇళ్లు జ‌ల‌మ‌యం అయ్యాయి. విద్యుత్ లైన్లు తెగిపోయాయి. అలాగే ట్రాఫిక్ ఎక్క‌డిక‌క్క‌డే నిలిచిపోతోంది. స‌ర‌స్సులు పొంగిపోర్లుతున్నాయి. 

లోత‌ట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవ‌డంతో టెక్కీలు, ఉద్యోగులు తమ ఆఫీసుల‌కు వెళ్లేందుకు, స్టూడెంట్లు స్కూల్స్ కు, కాలేజీల‌కు వెళ్లేందుకు ప‌డ‌వ‌లు, ట్రాక్ట‌ర్లు ఉప‌యోగిస్తున్నారు. ముఖ్యంతా రెయిన్‌బో డ్రైవ్ లేఅవుట్, సన్నీ బ్రూక్స్ లేఅవుట్, సర్జాపూర్ రోడ్‌లోని కొన్ని ప్రాంతాలు ఈ వ‌ర‌ద నీటి వ‌ల్ల తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. 

ఆర్య స‌మాజ్ ఇచ్చే మ్యారేజ్ స‌ర్టిఫికేట్ చెల్ల‌దు.. అల‌హాబాద్ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

టోనీ ఐటీ హబ్‌తో సహా ఔటర్ రింగ్ రోడ్డులోని చాలా ప్రాంతాలు జలమయం కావడం వ‌ల్ల ట్రాఫిక్‌కు సోమ‌వారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. బైక్ ల‌పై ఆఫీసుల‌కు వెళ్లే వారు మోకాళ్ల తోతు నీటిలో దిగి నెట్ట‌డం ఇక్క‌డ సాధారణం అయిపోయింది. ఈ వ‌ర‌ద‌ల వ‌ల్ల సాధారణ జీవనం స్తంభించిపోవడంతో అధికారులు, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ఆగ్రహం వ్య‌క్తం అవుతోంది. నీట మునిగిన ఇళ్ల వీడియోలు, నీటితో నిండిన రోడ్లు, ట్రాఫిక్ క‌ష్టాల‌ను వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తున్నారు. 

అస‌లే వ‌ర‌ద‌ల‌తో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న బెంగ‌ళూరు వాసుల‌కు తాగు నీటి క‌ష్టాలు కూడా ఎదుర‌వుతున్నాయి. కావేరి నది నుండి నగరానికి నీటిని పైకి ఎత్తిపోసే పంపింగ్ స్టేషన్ వ‌ర్షాల వ‌ల్ల మునిగిపోయింది. దీంతో రెండు రోజుల పాటు తాగు నీటి స‌ర‌ఫ‌రా నిలిపివేశారు. ప్ర‌స్తుతం పంపింగ్ స్టేషన్‌లోని నీటిని అధికారులు బయటకు పంపుతున్నారు. కానీ దాదాపు 50 ప్రాంతాల‌కు రెండు రోజుల పాటు తాగే నీరు అందే అవ‌కాశం లేదు. 

రాష్ట్రంలో వరదల నిర్వహణకు రూ.600 కోట్లను కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై సోమ‌వారం విడుద‌ల చేశారు. ఇందులో బెంగళూరు కోసమే రూ.300 కోట్లు కేటాయించిన‌ట్టు సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని నగరంలో వర్షాలు, వరదల పరిస్థితి వాటి వ‌ల్ల సంభవించిన నష్టాలను సమీక్షించడానికి సీనియర్ మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం తరువాత సీఎం ఈ ప్ర‌క‌ట‌న చేశారు. రోడ్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, పాఠశాలలు మ‌ర‌మ్మ‌తుల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. బెంగళూరులో వర్షపు నీటి కాలువల నిర్మాణానికి రూ.1,500 కోట్లు కేటాయించామని, నీరు తగ్గిన తర్వాత పనులు ప్రారంభిస్తామని బొమ్మై తెలిపారు. కాగా.. విపత్తు కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న నగరంలోని మహదేవపుర, బొమ్మనహళ్లి మండలాల్లో రెండు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డీఆర్‌ఎఫ్) బృందాలు రంగంలోకి దిగాయి.

కేరళలో రెడ్ అలర్ట్
కేర‌ళ రాష్ట్రంలోనూ వ‌ర్షాలు పడే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. మంగళవారం నాటికి కేరళలోని నాలుగు దక్షిణ జిల్లాలైన తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, ఇడుక్కి జిల్లాల్లో 24 గంటల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ, రెడ్ అలెర్ట్ ప్ర‌క‌టించింది. 

రాజధాని తిరువనంతపురంలోని అన్ని విద్యాసంస్థలు ఈరోజు మూసివేశారు. రాష్ట్రంలో ఓనం పండుగకు ముందు రోజు సెప్టెంబర్ 7వ తేదీ బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్, కన్నూర్‌లలో ఆరెంజ్ అలర్ట్‌ని కూడా జారీ చేశారు. కాగా తిరువనంతపురం సమీపంలోని పలోడ్‌లోని మంకాయం జలపాతం వద్ద వరదలో కొట్టుకుపోయి ఎనిమిదేళ్ల చిన్నారితో సహా ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు సోమవారం ‘పీటీఐ’కి తెలిపారు.

తమిళనాడులో విరిగిపడ్డ కొండచరియలు 
ఆదివారం రాత్రంతా తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిశాయి. అయితే రాష్ట్రంలోని హై-రేంజ్ నీలగిరి జిల్లా మెట్టుపాళయం-ఉదగమండలం ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో  ఆయా ప్రాంతాల్లో ర‌వాణాకు ఇబ్బంది ఏర్ప‌డింది. అలాగే వర్షాల కారణంగా కల్లార్, హిల్‌గ్రోవ్ మధ్య రైల్వే ట్రాక్‌లలో కొంత భాగం అంతరాయం కలిగింది.

బాలికను వెంబడించి, కిడ్నాప్ చేసి అత్యాచారం.. వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ.. మరోసారి..

ఇదిలా ఉండ‌గా.. సెప్టెంబరు 8, 9 తేదీల్లో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. అలాగే కేరళ, లక్షద్వీప్, తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 6, 7, 9 తేదీల్లో ‘అతి భారీ వర్షాలు’ కురుస్తాయని పేర్కొంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios