Bengaluru: హిజాబ్ ధరించి పరీక్ష రాసేందుకు అనుమతి కోరుతూ కర్ణాటకకు చెందిన బాలికలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ మతాన్ని ఆచరించే హక్కు రాజ్యాంగంలో ఉందని ముస్లిం విద్యార్థులు సుప్రీంకోర్టులో వాదించారు. అదే సమయంలో ఇస్లాంలో హిజాబ్ అవసరం లేదని ప్రతివాదనలు వినిపించాయి.
Karnataka Girls Move Supreme Court: హిజాబ్ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. పలువురు ముస్లిం బాలికలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కర్ణాటక ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలు హిజాబ్ ధరించి పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించాలన్న పిటిషన్ పై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది. హిజాబ్ ధరించడంపై నిషేధం అంశంపై సుప్రీంకోర్టు బెంచ్ విభిన్న తీర్పు వెలువరించిన నేపథ్యంలో మార్చి 9 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు హిజాబ్ ధరించిన బాలికలను అనుమతించడం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి పిటిషనర్ తెలిపారు.
"వారు హిజాబ్ ధరించారు. వారు బురఖా ధరిస్తే వారిని పరీక్ష హాల్లోకి అనుమతించరు. ఈ పిటిషన్ ను పరిమిత అంశంలోనే సోమవారం లేదా శుక్రవారం లిస్టింగ్ చేసే అంశాన్ని కోర్టు పరిశీలించవచ్చు" అని న్యాయవాది షాదన్ ఫరాసత్ తెలిపారు. అలాగే, హిజాబ్ ధరించడంపై నిషేధం కారణంగా కొంతమంది బాలికలు ప్రయివేటు విద్యాసంస్థలకు వెళ్లారనీ, అయితే ప్రభుత్వ సంస్థల్లో పరీక్షలు రాయాల్సి వస్తోందని జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనానికి తెలిపారు. అనుమతించకపోతే మరో ఏడాది నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.
కర్ణాటక హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులిద్దరికీ భిన్నాభిప్రాయాలున్నాయి. త్వరలోనే ఈ కేసు విచారణకు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కోర్టు తెలిపింది. కాలేజీ క్యాంపస్ లలో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై కర్ణాటక నిషేధం విధించింది. బుధవారం (ఫిబ్రవరి 22) ఒక న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి ముందు ఈ కేసును ప్రవేశపెట్టి, మార్చి 9 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలో బాలికలను హిజాబ్ లో హాజరయ్యేందుకు అనుమతించాలని కోరారు. దీనిపై చీఫ్ జస్టిస్ స్పందిస్తూ.. ఇందుకోసం బెంచ్ ఏర్పాటును పరిశీలిస్తామని చెప్పారు. గతంలో కూడా సుప్రీంకోర్టు ఈ కేసును 10 రోజుల పాటు విచారించినప్పటికీ న్యాయమూర్తుల భిన్నాభిప్రాయాల కారణంగా నిర్ణయం తీసుకోలేకపోయారు.
విచారణ చేపట్టనున్న ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం..
హిజాబ్ వివాదాన్ని జనవరి 23న సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా ప్రస్తావించారు. ఈ నెలలో ప్రాక్టికల్ పరీక్ష జరగాల్సి ఉందనీ, దీనికి కేసుతో ప్రభావితమైన ముస్లిం విద్యార్థులు హాజరు కావాల్సి ఉందని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంలో బాధిత విద్యార్థులు పరీక్షకు హాజరయ్యేలా మధ్యంతర ఆదేశాలు అవసరముందని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఈ కేసును త్రిసభ్య ధర్మాసనం విచారించేందుకు త్వరలోనే తేదీని నిర్ణయిస్తామని ఇదివరకు తెలిపింది.
హిజాబ్ కేసులో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
కర్నాటకలో మొదలైన హిజాబ్ వివాదం దేశంలోని చాలా ప్రాంతాలకు వ్యాపించి.. కోర్టులకు చేరింది. హిజాబ్ వివాదం కేసుపై 11 రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇస్లాంలో హిజాబ్ అవసరం లేదని ఈ నిర్ణయంలో స్పష్టం చేశారు. ఇది ఇస్లామిక్ సంప్రదాయంలో భాగం కాదని తెలిపింది. విద్యాసంస్థల్లో ఒక రకమైన యూనిఫాం ధరించడం తప్పనిసరి చేసినా ఫర్వాలేదు.. విద్యార్థులు కాదనలేరు, కానీ హిజాబ్ అవసరం లేదని పేర్కొంది.
