Asianet News TeluguAsianet News Telugu

ఆత్మలతో మాట్లాడటానికి ఇల్లు వదిలిన బాలిక.. రెండు నెలలుగా ఆచూకీ లేదు

బెంగళూరులో ఓ వింత కేసు నమోదైంది. ఆత్మల ప్రపంచంతో సంపర్కం చెంది.. ఇక్కడి ప్రపంచంలో మానసిక, శారీరక సమస్యలను నయం చేసుకోగలమని విశ్వసించే షామనిజంపై ఓ టీనేజర్ ఆసక్తి పెంచుకుంది. ఆ తర్వాత రెండు జతల డ్రెస్‌లు, రూ. 2,500లు తీసుకుని ఇల్లు వదిలిపెట్టి పోయింది. రెండు నెలలు గడిచాయి. ఇప్పటికీ ఆమ ఆచూకీ లభించడం లేదు. పోలీసులూ తలలు పట్టుకుంటున్నారు. 
 

bengaluru girl missing after reading about shamanism
Author
Bengaluru, First Published Dec 30, 2021, 5:54 PM IST

బెంగళూరు: మతంలో అనేక నిగూఢ అంశాలూ ఉంటాయి. అలాంటిదే ఒకటి ఈ షామనిజం(Shamanism). ఇదొక రకమైన ఆచారం. తమ చేతనావస్థను కొంత మార్పు చేస్తే ఆత్మల(Spirits)తో మాట్లాడగలమని నమ్మడమే ఈ షామనిజం. ఇది చాలా పురాతనమైన నమ్మకం. అయితే, ఈ నమ్మకంపైనా ఇంటర్‌నెట్‌లో కొంతమంది లెక్చర్లు ఇస్తున్నారు. ఈ షామనిజం గురించి చదివి.. చదివి.. బెంగళూరు(Bengaluru)కు చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటిని వదిలేసింది. తమ కూతురు ఇటీవల షామనిజం గురించి ఎక్కువగా తెలుసుకుందని, బహుశా అలాంటి ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ సూచన మేరకే ఇల్లు వదిలి ఉంటుందని పేరెంట్స్ చెప్పారు. ఆమె రెండు నెలలుగా కనిపించడం లేదు. ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారు కూడా చాలా సీసీటీవీలను పరిశీలించారు. కానీ, ఆమె కనిపించకుండా పోయిన చోటులో సీసీటీవీలు లేవని తెలిపారు. ఈ కేసు చాలా ట్రిక్కీ అని చెబుతున్నారు.

బెంగళూరుకు చెందిన 17 ఏళ్ల అనుష్క రెండు నెలలుగా కనిపించడం లేదు. అక్టోబర్ 31న ఆమె ఇల్లు వదిలిపెట్టి పోయింది. రెండు జతల డ్రెస్‌లు, రూ. 2,500లతో బయటికి వెళ్లింది. మళ్లీ తిరిగి రాలేదు. ఆమె ఆన్‌లైన్‌లో షామనిజం గురించి విరివిగా చదివింది. ఆత్మల ప్రపంచం సహాయంతో మనుషుల మానసిక, భౌతిక సమస్యలను నివారించగలమని నమ్మడమే ఈ షామనిజం. 12వ తరగతి చదుతున్న అనుష్క ఈ షామనిజంపై ఆసక్తి పెంచుకుంది. స్పిరిచువల్ లైఫ్ కోచ్‌లు, సైక్‌డెలిక్ ఎడ్యుకేటర్లతో బోధనలతో ఆమె ప్రేరణ పొందింది. షామనిజం ప్రాక్టీస్ చేయాలనే తన కోరికను వారికి తెలియజేసింది కూడా అని ఆమె తల్లిదండ్రులు వివరించారు.

Also Read: యువ డాన్సర్ ఆత్మహత్య.. ఆ కోరిక తీర్చితేనే నా ఆత్మకు శాంతి.. ప్రధాని మోడీకి సూసైడ్ నోట్‌లో విన్నపం

తమ కూతురు మైనర్ అని, ఆమె స్వతహాగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉండదని తండ్రి అభిషేక్ వివరించారు. తనతోనూ ఆమె షామనిజం ఫాలో అవుతానని చెప్పిందని అన్నారు. ఆమె అందరిలాగే వ్యవహరించేదని, కానీ, సెప్టెంబర్ నుంచి ఆమెలో మార్పులు వచ్చాయని తెలిపారు. అప్పటి నుంచి ఆమె నిష్కర్షగా తయారైందని, ఎవరినీ పట్టించుకోవడం లేదని చెప్పారు. దీంతో ఆమెను ఓ కౌన్సిలర్ దగ్గరకు తీసుకెళ్లామని, కానీ, ఆమె పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమె తమ అందరితోనూ మాట్లాడటమే మానేసిందని తెలిపారు. ఆమె ఎవరితోనూ కలవడం మానేసిందని, ఇంట్లో రోజువారీ పనుల్లోనూ పాల్గొనలేదని చెప్పారు.

Also Read: గతజన్మ గుర్తొచ్చింది.. ఆదివారాలు ఆఫీసుకు రాలేను.. ఇంజనీర్ లీవ్ అప్లికేషన్.. దిమ్మదిరిగే రిప్లై ఇదే

పోలీసులు ఆమె గురించి తీవ్రంగా గాలింపులు జరుపుతున్నారు. తాము సీసీటీవీల ద్వారా ఆమె కదలికలను పరిశీలించామని బెంగళూరు నార్త్ డిప్యూటీ కమిషనర్ వినాయక్ పాటిల్ చెప్పారు. ఆమె ఆన్‌లైన్ కార్యకలాపాలను అధ్యయనం చేశామనీ, ఇటీవలి కాలంలో ఆమె ఎవరితోనూ టచ్‌లో లేదని పేర్కొన్నారు. తాము సీసీటీవీలను ఇంకా పరిశీలిస్తున్నామని తెలిపారు. పోలీసులకూ ఆమెను వెతకడం అంత సులభం కాకపోవడంతో పేరెంట్స్ సోషల్ మీడియాలో ఆమె గురించి పోస్టులు పెట్టారు. ఎవరికైనా కనిపిస్తే ఆచూకీ చెప్పవలసిందిగా కోరారు. ఆమె ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేసి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios