బెంగళూరు నగరంలో నీటి పారుదల కోసం అధికార బీజేపీ ప్రభుత్వం రూ.1,500 కోట్లు కేటాయించిందని, ఆక్రమణల తొలగింపు, పునరుద్దరణ చర్యలకు అదనంగా రూ.300 కోట్లు ఇచ్చిందని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు.
కర్నాటక: బెంగళూరు లో కురుస్తున్న భారీ వర్షాలతో అనేక సరస్సులు, మురికినీటి కాలువలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తడంతో పరిస్థితులు దారుణంగా మారాయి. జనజీవనం స్తంభించిపోయింది. ప్రజా ఇబ్బందులు పెరుగుతున్నాయి. నగరంలో దివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా నీటి ఎద్దడి, ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో.. గత కాంగ్రెస్ హయాంలోని దుష్పరిపాలన వల్లే ఈ నీటి ఎద్దడి ఏర్పడిందని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఆరోపించారు. నగరంలో వరదల పరిస్థితులు దారునంగా మారడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం అని ఆరోపించారు. "ఇది (బెంగళూరులో నీటి ఎద్దడి) గత కాంగ్రెస్ ప్రభుత్వ దుష్పరిపాలన & పూర్తిగా ప్రణాళిక లేని పరిపాలన కారణంగా జరిగింది. గత సర్కారు సరస్సులు & బఫర్ జోన్‌లైన కుడి, ఎడమ-మధ్యలో అనుమతి ఇచ్చారు" అని సిఎం బొమ్మై చెప్పినట్టు ఏఎన్ఐ నివేదించింది.
కాగా, బెంగళూరు నగరంలో నీటి పారుదల కోసం అధికార బీజేపీ ప్రభుత్వం రూ.1,500 కోట్లు కేటాయించిందని, ఆక్రమణల తొలగింపు, పునరుద్దరణకు అదనంగా రూ.300 కోట్లు ఇచ్చిందని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు. ఈ సమస్య రెండు మండలాల్లో ఉందని, ముఖ్యంగా మహదేవ్‌పురలో 69 చెరువులు ఉన్నాయని, అన్నీ పొంగిపొర్లుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అనేక సంస్థలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయని, అధికంగా ఆక్రమణలేనని ఆయన అన్నారు. బెంగళూరులో తాగునీటి సరఫరాపై సీఎంను ప్రశ్నించగా, మాండ్య జిల్లాలోని రెండు నీటి పంపింగ్ స్టేషన్‌లలో వర్షపు నీరుతో ప్రభావితమైందని, మొదటి పంపుహౌస్ నుండి నీరు తగ్గిపోయిందని, త్వరలో సరఫరా ప్రారంభిస్తామని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నానికి మరో పంపుహౌస్‌ను క్లియర్ చేయనున్నారు. ఈలోగా ట్యాంకర్లు, బోర్‌వెల్‌ల ద్వారా నీరు అందిస్తామని చెప్పారు.
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు డీకే శివకుమార్ తన ట్విట్టర్‌లో.. "కర్ణాటకలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వీడియోలు చూపించినట్లుగా బెంగళూరు, మైసూరు, చామరాజనగర్‌తో సహా అనేక ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని పేర్కొన్నారు. "ఇటువంటి కష్ట సమయాల్లో, కర్ణాటక ప్రదేశ్ యూత్ కాంగ్రెస్, కర్ణాటక నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా, కర్ణాటక కాంగ్రెస్ సేవాదళ్ ముందుకు వచ్చి సాధ్యమైన చోట సహాయం అందించాలని" అని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
