తాగిన మైకంలో ఓ వ్యక్తి మాట్లాడిన మాటలే అతని ప్రాణం తీశాయి. స్నేహితుడి భార్య శీలం గురించి చులకనగా మాట్లాడి.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బెంగళూరు నగరం  చెన్నసండ్ర నగర్ కి చెందిన శివరాజ్ హోటల్ లో పనిచేస్తున్నాడు. అతనికి భార్య నాగమ్మ కూడా ఉంది. కాగా... రెండు రోజుల క్రితం నాగమ్మను కలిసేందుకు ఆమె చిన్ననాటి స్నేహితుడు ఒకరు ఇంటికి వచ్చాడు. ఈ విషయంలో నాగమ్మకు భర్త శివరాజ్ కి తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. కాగా... అక్కడే ఉన్న శివరాజ్ స్నేహితులు శేశు, సుబ్రహ్మణ్యంలు కలగజేసుకొని గొడవ సద్దుమణిగేలా చేశారు.

ఆ రోజు రాత్రి... శివరాజ్ తన స్నేహితులు శేశు, సుబ్రహ్మణ్యంలతో కలిసి మద్యం సేవించాడు. తర్వాత శేశు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఉదయం జరగిన సంభాషణ గురించి శివరాజ్, సుబ్రహ్మణ్యం ల మధ్య సంభాషణ నడిచింది. ఈ క్రమంలో నాగమ్మ ప్రవర్తన సరిగా లేదని... ఇతరులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటోందని సుబ్రహ్మణ్యం నోరుజారాడు.

తన భార్య గురించే తప్పుగా మాట్లాడతావా అనే కోపంతో శివారజ్... స్నేహితుడని కూడా చూడకుండా సుబ్రహ్మణ్యం గొంతు పిసికి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేశాడు. అయితే మర్నాడు ఉదయం రోడ్డు మీద మృతదేహం ఉందన్న సమాచారం అందుకున్న పోలీసులు శివారాజ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణ జరపగా ఈ హత్య వెనుక అసలు నిజం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు