బెంగళూరులో ఓ కానిస్టేబుల్ స్కూటీ చోరీకి గురైంది. ఆ తర్వాత అది పోలీసు స్టేషన్‌లో ప్రత్యక్షమైంది. పోలీసులు దాన్ని వేలం వేయగా.. వేలం వేసిన ఓ పోలీసు అధికారి భార్యనే దాన్ని తక్కువ మొత్తం బిడ్ పలికి దక్కించుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం పెండింగ్ చలాన్లు చెల్లించడంపై 50 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చిన సమయంలో దాని వాస్తవ యజమాని తన స్కూటీ పై ఇటీవలే చలాన్ పడినట్టు కనుగొని, దాన్ని నడిపిన వారిని పట్టుకున్నారు.
బెంగళూరు: కనీసం నలుగురు బెంగళూరు పోలీసులు చిక్కుల్లో పడ్డారు. దొంగిలించబడ్డ స్కూటీని వేలం వేసి అమ్మిన ఉదంతంలో వీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ స్కూటీని నిబంధనలకు లోబడి వేలం వేయలేదని, కోర్టులో అబద్ధం చెప్పారనే ఆరోపణలు వారు ఎదుర్కొంటున్నారు. పెండింగ్ చలాన్లకు 50 శాతం డిస్కౌంట్ ఇస్తూ ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్ ఈ ఉదంతంలో కీలకంగా ఉన్నది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కమ్మగొండనహల్లిలో ఉండే కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఏ నాగరాజుకు ఓ స్కూటీ ఉన్నది. ఆ స్కూటీ 2020 ఆగస్టు 12వ తేదీన ఇంటి వద్ద పార్క్ చేయగా.. దాన్ని గుర్తు తెలియని దుండగులు అపహరించారు. 2020 నవంబర్ 8వ తేదీన గంగమ్మ గుడి పోలీసు స్టేషన్‌లో నాగరాజు ఫిర్యాదు చేశాడు.
ఆ స్కూటీ పోలీసు స్టేషన్‌కు వచ్చింది. ఆ స్కూటీని ప్రస్తుతం సిటీ పోలీసు కమిషనర్ ఆఫీసులో పని చేస్తున్న పోలీసు రవి, నేలమంగల టౌన్ పోలీసు ఇన్‌స్పెక్టర్ రాజీవ్‌లు వేలం వేశారు. ఆ వేలంలో స్కూటీని కేవలం రూ. 4,000కు పోలీసు అధికారి రవి భార్య ఆశా రవి బిడ్ వేసి దక్కించుకున్నారు. ఈ వేలం బ్యాదరహల్లి పోలీసు స్టేషన్‌లో నిర్వహించారు. వేలం వేసిన రవి అప్పుడు బ్యాదరహల్లిలో హెడ్ కానిస్టేబుల్‌గా ఉన్నారు. రాజీవ్ కూడా అక్కడే పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నారు.
స్కూటీ పోయిందని నాగరాజు 2020 నవంబర్ 8వ తేదీన ఫిర్యాదు చేశారు. కానీ, ఆ స్కూటీని 2020 నవంబర్ 4వ తేదీనే వేలం వేశారు. 2021 మార్చిలో ఆ స్కూటీని ట్రేస్ చేయలేకపోతున్నామని గంగమ్మ గుడి పోలీసులు కేసు క్లోజ్ చేశారు.
Also Read: 13 ఏళ్ల బాలుడితో 31 ఏళ్ల మహిళ శృంగారం, గర్భం దాల్చిన ఆమె ప్రసవం.. జైలు నుంచి విడుదల
ఇంతలో కర్ణాటక ప్రభుత్వం పెండింగ్ ట్రాఫిక్‌లు చెల్లించడంపై 50 శాతం తగ్గింపును ప్రరకటించింది. ఆ సమయంలో నాగరాజు తన స్కూటీ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను ఎంటర్ చేయగా.. దానిపై చలాన్ ఉన్నట్టు కనిపించింది. హెల్మెట్ లేకుండా ఓ మహిళ తన స్కూటీని నడుపుతున్న దృశ్యం కనిపించింది. నాగరాజు వెంటనే ఆ మహిళ అడ్రస్ కనుక్కున్నారు. ఆమె రవి భార్య అని తెలుసుకోగలిగారు. ఆ వెంటనే అతను రవి, రాజీవ్‌లతో గొడవకు దిగి వివరణ అడిగారు.
రవి, రాజీవ్‌లపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ఎంక్వైరీ రిపోర్టు ఇప్పుడు డీజీపీ, ఐజీ ఆఫీసులో ఉన్నది.
కాగా, ఆ స్కూటీని వాస్తవ యజమాని నాగరాజుకు అప్పగించారు. రవి, రాజీవ్‌లపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని నాగరాజు చెబుతుండటంతో ఈ వివాదం ఇంకా ముదిరేలా కనిపిస్తున్నది.
