Asianet News TeluguAsianet News Telugu

బెంగళూరు ట్రాఫిక్‌లో చిగురించిన ప్రేమ.. వైరల్ అవుతున్న లవ్ స్టోరీ

బెంగళూరు ట్రాఫిక్ గురించి ఎప్పుడూ అనేక అవాంతరాలు, చికాకు గురించి ప్రయాణికులు చెప్పుకుంటుంటారు. సోషల్ మీడియాలోనూ ఈ ట్రాఫిక్ జామ్ గురించి పుంఖానుపుంఖాలుగా ట్వీట్లు వచ్చాయి. కానీ, ఓ యూజర్ మాత్రం ఈ ట్రాఫిక్ జామ్‌లోనే తమ ప్రేమ చిగురించిందని తెలిపారు.
 

bengalurian wrotes.. their love started in bengaluru traffic story goes viral
Author
First Published Sep 21, 2022, 12:57 PM IST

బెంగళూరు: ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయామంటే.. ఆ రోజంతా చికాకుగానే ఉంటుంది. ఒక్కోసారి గంటల తరబడి రోడ్లపైనే హారన్‌ల రోదలో గడపాల్సి వస్తుంది. ముఖ్యంగా ఐటీ హబ్‌గా భావించే బెంగళూరులో ఈ బాధ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఐటీ ఇండస్ట్రీలో గణనీయమైన పురోగతి సాధించినా.. రోడ్లు, ఫ్లై ఓవర్లు, సరైన ట్రాఫిక్ వసతుల విషయంలో మాత్రం బెంగళూరుపై ఇప్పటికీ సోషల్ మీడియాలో మీమ్స్ వస్తుంటాయి. అయితే, ట్రాఫిక్ అంటే ఎప్పుడూ కలవరపాటుకు గురయ్యే  ప్రయాణికుల గాధలే కాదు.. కొన్ని పాజిటివ్ కహానీలు కూడా ఉంటాయని ఇప్పుడిప్పుడే చర్చిస్తున్నారు. ఇందుకు ఓ ప్రేమ కథ కారణం. ఔను.. బెంగళూరు ట్రాఫిక్ అంటేనే గుండెలు జారిపోతాయి. కానీ, ఆ ట్రాఫికే తమ ప్రేమకు బీజం వేసిందని ఓ జంట సోషల్ మీడియాలో పోస్టు చేయడం సంచలనంగా
మారింది.

బెంగళూరు ట్రాఫిక్‌లోనే తమ ప్రేమ చిగురించిందని, ఆ ట్రాఫిక్ జామ్ కారణంగానే తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి డిన్నర్‌కు వెళ్లానని, అక్కడే తమ మధ్య రొమాన్స్ ప్రారంభమైందని ఓ వ్యక్తి తన రెడ్డిట్‌లో వెల్లడించాడు. తన ప్రేమ చిగురించిన ఐదేళ్ల తర్వాత ఈ విషయాన్ని ఆయన పోస్టు చేశాడు.

బెంగళూరులోని ఎజిపుర ఫ్లైఓవర్ నిర్మాణం కేంద్రంగా తన ప్రేమ కథను చెప్పుకొచ్చాడు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం అక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అవుతుందని తెలిపాడు. ఈ ఫ్లై ఓవర్‌కు వెళ్లే దారిలోని సోనీ వరల్డ్ సిగ్నల్ దగ్గరే తన భార్యను కలిశానని చెప్పాడు.ఆ తర్వాతే వారిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారని, అనంతరం ప్రేమికులు అయినట్టు పేర్కొన్నాడు.

ఆమె ముఖ పరిచయం ఉన్నదని, కేవలం ఒక ఫ్రెండ్ లాగా మాత్రమే తెలుసు అని ఆయన తెలిపాడు. ఆమెను ఒక రోజు ఇంటి వద్ద డ్రాప్ చేయడానికి బయల్దేరానని వివరించాడు. ఎజిపుర ఫ్లై ఓవర్ వర్క్ జరుగుతున్నందున అక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయిందని చెప్పాడు. చాలా సేపు అక్కడే ఎదురుచూసిన ఇద్దరికీ ఫ్రస్ట్రేషన్ వచ్చిందని పేర్కొన్నాడు. దీనికి తోడు వారిద్దరికీ ఆకలి అయిందని తెలిపాడు. దీంతో సమీపంలోని రెస్టారెంట్‌లో డిన్నర్ కోసం ఇద్దరూ తమ వాహనాన్ని డైవర్ట్ చేసుకుని వెళ్లారని వివరించాడు. ఆ డిన్నరే తమ ప్రేమకు పునాది అని చెప్పాడు. ఆ డిన్నర్‌లోనే తమ మధ్య రొమాన్స్ మొదలైందని పేర్కొన్నాడు.

అప్పటి నుంచి తాము మూడేళ్ల పాటు డేట్ చేశామని తెలిపాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నామని, ఇప్పుడు పెళ్లి చేసుకుని రెండేళ్లు గడిచిందని వివరించాడు. ఈ స్టోరీలో మరో ట్విస్ట్ ఇచ్చాడు. తమ ప్రేమ కథ.. పెళ్లిగా పరిణమించిందని, పెళ్లయి రెండేళ్లు గడిచినా ఆ రెండున్నర కిలోమీటర్ల ఫ్లై ఓవర్ మాత్రం ఇంకా నిర్మాణంలోనే ఉన్నదని వివరించాడు.

ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది తమ అభిప్రాయాలను, తమ అనుభవాలనూ ఈ కథకు జోడించారు. తాను బెంగళూరులో ఉన్నన్ని రోజులు ఆ ఫ్లై ఓవర్ నిర్మాణంలోనే ఉన్నదని ఓ యూజర్ పేర్కొన్నారు. మరొక యూజర్.. అక్కడే సమీపంలో ఓ రోడ్డు నిర్మాణాన్ని ప్రస్తావించాడు. ఆ రోడ్డు నిర్మాణం ప్రారంభం అయినప్పటి నుంచి తాను స్కూలింగ్, కాలేజీ విద్య పూర్తి చేసుకున్నానని తెలిపాడు. ఆ రోడ్డు పూర్తిగా రిపేర్ చేసి మళ్లీ వేసే సరికి తాను జాబ్‌లో కూడా చేరానని చెప్పాడు.

Follow Us:
Download App:
  • android
  • ios