పశ్చిమ బెంగాల్‌లోనూ మణిపూర్ తరహా ఘటన చోటుచేసుకుంది. బెంగాల్ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు బీజేపీకి చెందిన ఓ మహిళపై భౌతిక దాడికి దిగి ఆ తర్వాత ఆమెను వివస్త్ర చేశారని, నగ్నంగా ఊరిలో ఊరేగించారు.
కోల్‌కతా: మణిపూర్‌లో ఇద్దరు కుకీ తెగ మహిళలను నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతూనే ఉన్నది. ఇదే సందర్భంలో పశ్చిమ బెంగాల్‌లోనూ అలాంటి ఘటనే చోటుచేసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో స్థానిక ఎన్నికలు జరుగుతుండగా బీజేపీకి చెందిన ఓ మహిళను వివస్త్రురాలు చేసి టీఎంసీ గూండాలు ఆమెను ఊరిలో ఊరేగించారని వార్తలు వస్తున్నాయి. జులై 8వ తేదీన టీఎంసీ గూండాలు ఈ హీనమైన పని చేశారని బీజేపీ ఆరోపణలు చేసింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు ప్రకారం, హౌరా జిల్లాలో పంచ్లా ఏరియాలో సుమారు 40 మంది తృణమూల్ కాంగ్రెస్ గూండాలు పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా ఈ దాడికి పాల్పడ్డారు. ‘కర్రతో నా ఛాతి, తలపై దాడి చేశారు. పోలింగ్ కేంద్రం నుంచి బయటకు విసిరేశారు’ అని ఆమె పేర్కొన్నారు. ‘కొందరు నన్ను కొడుతూ ఉండగా అలీ షేక్, సుకమల్ పంజాలు నా చీర, లోదుస్తులను చించేయాలని హిమంత రాయ్ ప్రేరేపించాడు. ముందు వారు నాపై దాడి చేసి ఆ తర్వాత వివస్త్రను చేశారు. అందరి ముందు అసభ్యకరంగా బలవంతంగా నన్ను టచ్ చేశారు’ అని ఆ బాధితురాలు ఫిర్యాదు చేశారు.
టీఎంసీకి చెందిన హిమంత రాయ్, నూర్ ఆలాం, అల్ఫీ ఎస్కే, రణబీర్ పంజా సంజు, సుకమల్ పంజాలను ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
Also Read: కోల్డ్ వార్ ఉండేది.. వివేకా హత్యకు రాజకీయపరమైన కారణాలు!: వైఎస్ షర్మిల వాంగ్మూలంలో కీలక వ్యాఖ్యలు
మమతా బెనర్జీపై బీజేపీ దాడి
బెంగాల్ బీజేపీ కో ఇంచార్జీ అమిత్ మాలవీయా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై మండిపడ్డారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే సీఎం పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. మణిపూర్ ఘటనను తాము ఖండిస్తున్నామని, కానీ, బెంగాల్ ఘటన కూడా దానికి ఏం తక్కువ కాదని బెంగాల్ బీజేపీ చీఫ్ సుకంత మజుందార్ పేర్కొన్నారు. ఉన్న తేడా మణిపూర్ ఘటనకు వీడియో ఉన్నదని, బెంగాల్ ఘటనకు వీడియో లేదని తెలిపారు.