"బీజేపీకి భారీ మొత్తంలో హవాలా మనీ చేరుతోంది": కారులో రూ. 93 లక్షలు దొరికిన తర్వాత మమతా బెనర్జీ ఆరోపణలు
పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలో ఆదివారం ఓ వాహనంలో రూ.93.83 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ..ఆ డబ్బు బిజెపికి వెళుతుందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌కు డబ్బు, తుపాకులు , గూండాలను తీసుకురావడానికి బిజెపి కేంద్ర బలగాలను ఉపయోగించిందని బెనర్జీ పేర్కొన్నారు. కాషాయ పార్టీ నాయకులతో రాజకీయంగా పోరాడాలని అన్నారు.

పశ్చిమ బెంగాల్ జల్‌పైగురి జిల్లాలోని హైవే 48లో పోలీసులు ఆదివారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఓ కారులో రూ.93.83 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ కారు అలీపుర్‌దువార్ వైపు వెళుతున్నట్లు తెలిపారు. బీహార్ లోని పూర్నియా జిల్లాలో ఆ కారు రిజిస్టర్ చేయబడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ‘హవాలా గురించి నాకు తెలుసు. డబ్బులన్నీ బీజేపీకే వస్తున్నాయి. పోలీసులు కూడా విచారణ చేయలేక కేంద్ర భద్రతా బలగాల సాయంతో డబ్బు, గూండాలు, తుపాకులు తెస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలని బీజేపీ నేతలను కోరుతున్నాను. బలవంతంగా కాకుండా రాజకీయంగా పోరాడుదామని బెనర్జీ పేర్కొన్నారు.
బిన్నగురి పోలీసు పోస్ట్‌కు చెందిన అధికారులు ఆదివారం సాయంత్రం బనార్‌హట్ ప్రాంతంలోని ఏషియన్ హైవే (AH-48)పై బీహార్-రిజిస్టర్డ్ SUVని అడ్డగించారు. సెర్చ్ ఆపరేషన్ తర్వాత ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. కారును అడ్డగించి బనార్హాట్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. టైర్ కట్ చేసి చూడగా మొత్తం 94 లక్షల రూపాయల కట్టలు కనిపించాయి. నిందితులు డబ్బు మూలాన్ని వివరించడంలో విఫలమయ్యారని, వారిని జల్పైగురి కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఘటనపై జల్‌పైగురి పోలీస్ సూపరింటెండెంట్ బిశ్వజిత్ మహతో మాట్లాడుతూ.. “బీహార్ నుండి అస్సాంకు ఎవరో డబ్బు తీసుకెళ్తున్నారనే సమాచారం ఆధారంగా మేము కారును అడ్డగించాము. మేము బిన్నగురి వద్ద చెక్‌పాయింట్ పెట్టాము. చివరగా బీహార్ నంబర్ ప్లేట్ ఉన్న కారును మేము గుర్తించాము. అది నల్లటి స్కార్పియో. వారిని విచారించాం. స్పేర్ వీల్‌లో డబ్బు దాచినట్లు మేము కనుగొన్నాం. ఆ టైర్‌ను ఓపెన్ చేయగా.. భారీ మొత్తంలో డబ్బు బయటపడింది. డబ్బును లెక్కించేందుకు మాకు సహాయం చేయాల్సిందిగా బ్యాంక్ మేనేజర్‌ని అభ్యర్థించాము. మొత్తం రూ. 93 లక్షల 83 వేలు రికవరీ అయ్యాయి. అని పేర్కొన్నారు. కాగా, బెనర్జీ ఆరోపణలపై బీజేపీ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ స్పందిస్తూ ఆమెను అబద్దాలకోరు అని అన్నారు.
జీ-20 లోగోలో దీదీ ఫైర్
జీ-20 లోగోలో కమలం చిత్రాన్ని ఉపయోగించడంపై దేశవ్యాప్తంగా వివాదం మొదలైంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తీవ్ర స్పందించారు.కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం మమత దుయ్యబట్టారు. జి-20 లోగోలో కమలం బదులు ఇంకేదైనా చిహ్నాన్ని ఉపయోగించవచ్చు. 2023లో జరగనున్న జి 20 శిఖరాగ్ర సమావేశానికి సన్నాహాల గురించి చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోడీ.. సమావేశాన్ని పిలిచారని, ఇందులో పాల్గొనడానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీకి బయలుదేరారు.
కమలం బీజేపీ ఎన్నికల గుర్తు
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంకా మాట్లాడుతూ.. 'జి-20 సమావేశం అంతర్జాతీయ స్థాయి సమావేశం. కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఇతర చిహ్నాన్ని కూడా ఎంచుకోవచ్చు. కమలం మన జాతీయ పుష్పం కావచ్చు. కానీ.. కమలం ఓ రాజకీయ పార్టీ ఎన్నికల గుర్తు కూడా. ఈ విషయం దేశం వెలుపల చర్చకు వస్తే అది ఏమాత్రం మంచిది కాదన్నారు. లోగోలో కమలం ఉపయోగించడంపై దేశంలోని ఇతర పార్టీలు కూడా ప్రశ్నలు లేవనెత్తాయి. పువ్వు కూడా రాజకీయ పార్టీ లోగో అని కాదనలేం. అనేక జాతీయ చిహ్నాలు ఉపయోగించబడవచ్చు. నేను ప్రశ్నించకపోయినా, ఇతరులు చేయవచ్చు. అని అన్నారు.
G-20 లోగోలో 'కమలం' ఎందుకు?
ఈ జి-20 లోగో కేవలం చిహ్నం మాత్రమే కాదు.. ఇది ఒక సందేశం. ఇది ఒక భావోద్వేగం అని ప్రధాని మోదీ అన్నారు. ఇది మన ఆలోచనలో చేర్చబడిన తీర్మానం. మేము ఈ లోగో, థీమ్ ద్వారా సందేశం ఇచ్చాము. యుద్ధం నుండి విముక్తి కోసం బుద్ధుడి సందేశం హింసను నిరోధించడానికి మహాత్మా గాంధీ యొక్క పరిష్కారమని ఆయన అన్నారు. జి20 ద్వారా భారత్ తన ప్రపంచ ప్రతిష్టకు కొత్త శక్తిని ఇస్తోందని, జి-20 లోగో వినియోగం గురించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కమలం మన దేశ సంస్కృతికి గుర్తింపు అని అన్నారు.