పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ వేడెక్కింది. అధికారం నిలబెట్టుకోవాలని తృణమూల్ కాంగ్రెస్, బెంగాల్‌లో తొలి సారి పాగా వేయాలని బీజేపీ పావులు కదుపుతున్నాయి.

ఘర్షణలు జరుగుతున్నా, రాళ్లు మీద పడుతున్నా కమలనాథులు వెనక్కి తగ్గడం లేదు. ఇక మాటల యుద్ధానికి లెక్కలేదు. తాజాగా తృణమూల్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ క్యూలైన్‌లో నిల్చొని హెల్త్ కార్డు తీసుకోవడంపై కమలనాథులు సెటైర్లు వేస్తున్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసమే దీదీ క్యూలో నిలబడ్డారని ఎద్దేవా చేస్తున్నారు. 

కాగా పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం అందిస్తున్న ‘స్వస్థ్య సాథి’ హెల్త్‌ కార్డును మమతా బెనర్జీ సాధారణ పౌరురాలిలా క్యూ లైన్‌లో నిల్చోని తీసుకున్నారు. మంగళవారం ఉదయం రాజధాని కోల్‌కతా కాళీఘాట్‌లోని జోయ్‌ హింద్‌ భవన్‌లో గల కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ పంపిణీ కేంద్రానికి ముఖ్యమంత్రి వచ్చారు.

దీంతో అధికారులంతా లేచి ఆమెకు కార్డు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దీదీ మాత్రం స్థానికులతో కలిసి క్యూలో నిల్చున్నారు. క్యూలో తన వంతు వచ్చే వరకు వేచిచూసి హెల్త్‌ కార్డు తీసుకున్నారు. ఆమెతో పాటు రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి ఫిర్హద్‌ హకీమ్‌ కూడా క్యూలో నిల్చున్నారు.   

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం తన కార్డు తీసుకునేందుకు క్యూలో వేచిచూశారని తెలిపారు. రాష్ట్ర ప్రజల్లో తానూ ఒకరిని అని చెప్పేందుకే మమత ఇలా చేశారని ఆయన ప్రశంసించారు.  

కాగా, ‘దౌరే సర్కార్‌’ కార్యక్రమంలో భాగంగా స్వస్థ్య సాథి పేరుతో బెంగాల్‌ ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది. దీని ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏడాదికి రూ. 5లక్షల వరకు ఆరోగ్య బీమా అందించనుంది.