ప్రధాని నరేంద్రమోడీకి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య పోరు తీవ్ర స్థాయిలో నడుస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ అగ్రనేతల పర్యటనలను దీదీ అడ్డుకోవడం... ఆమెపై ప్రధాని, అమిత్ షాలు విరుచుకుపడటం ఆనవాయితీగా మారింది.

ఈ క్రమంలో ఆదివారం అర్థరాత్రి కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను ప్రశ్నించడానికి సీబీఐ ఆయన నివాసానికి వెళ్లడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.

వెంటనే సీపీ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు సీబీఐ అధికారులను అడ్డుకుని వారిని జీపులో పడేసి పీఎస్‌కు తరలించారు. డీజీపీతో పాటు కమిషనర్‌ కార్యాలయానికి చేరుకున్న మమతా బెనర్జీ రాత్రికి రాత్రి నడిరోడ్డుపై ధర్నాకు దిగారు.

తన పాలనా యంత్రాంగం మీద దాడికి ప్రధాని కేంద్ర బలగాలను పంపిస్తున్నారని ఆరోపించారు. సోమవారం జరగాల్సిన శాసనసభ సమావేశాలు తాను కూర్చొన్నచోటనే జరుగుతాయని తేల్చి చెప్పారు.

బెంగాల్‌పై బీజేపీ కత్తికట్టిందని.. రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తోందని, విపక్షాల ఐక్యత సభను ఇక్కడ నిర్వహించినందుకే ఇదంతా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉన్నతాధికారుల్ని వేధించడం ద్వారా రాష్ట్రంలో అలజడి సృష్టించాలని కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. మరోవైపు మమతా బెనర్జీ దీక్షకు టీడీపీ, సమాజ్‌వాదీ, ఆర్జేడీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, డీఎంకే తదితర విపక్ష నేతలు మద్ధతు ప్రకటించారు.