ప్రధాని నరేంద్రమోడీతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సమావేశమయ్యారు. బుధవారం ఢిల్లీలోని ప్రధాని నివాసానికి చేరుకున్న మమత.. మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి.. కుర్తా, బెంగాలీ స్వీట్స్‌ను బహుకరించారు.

రాష్ట్రంలోని ప్రధాన సమస్యలు, ఎన్ఆర్‌సీ గురించి మమత ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. భేటీ అనంతరం దీదీ మాట్లాడుతూ.. ప్రధానితో సమావేశం సంతోషకరంగా జరిగిందని.. బెంగాల్ రాష్ట్రానికి పేరు మార్పుపై ప్రధాని సానుకూలంగా స్పందించారని మమత పేర్కొన్నారు.

మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య సమావేశం జరగడం ఇదే తొలిసారి. అయితే శారద స్కాంలో కోల్‌కతా మాజీ పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ అరెస్ట్‌ను ఆపేందుకే దీదీ.. ప్రధానిని కలిశారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.