కోల్‌కతా: దుర్గాదేవి శక్తి, బెంగాల్ ప్రజల భక్తిని చూస్తే తనకు బెంగాల్‌లోనే ఉన్నట్టు అనిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.

గురువారం నాడు ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దుర్గాదేవీ పూజలో ఆయన పాల్గొన్నారు.కోవిడ్ మహమ్మారి మధ్చ మనమంతా ఈ ఏడాది దుర్గాదేవి పూజను జరుపుకొంటున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ప్రతి ఒక్కరూ మొత్తం ఏర్పాట్లపై అపారమైన నియంత్రణ, నిబద్దతను చూపించారన్నారు. బెంగాల్ ప్రజలు ఎల్లప్పుడూ మేధావులని ఆయన చెప్పారు. దేశం గర్వించదగిన మేధావులు రాష్ట్రంలో పుట్టినవారని ఆయన గుర్తు చేశారు.ఈ పవిత్రమైన రోజున తాను బెంగాల్ పుణ్యభూమికి నివాళులు అర్పిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.

లోకేనాథ్ బాబా,రవీంద్రనాథ్ ఠాకూర్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, రాణి రష్మోని, ఇతర అనేక మంది బెంగాలీలకు తాను నివాళులర్పిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.

స్వాతంత్ర్య ఉద్యమానికి ముందుగా స్వదేశీ ఉద్యమం బెంగాల్ నుండే ప్రారంభమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర చటర్జీలు ఆత్మనిర్భర్ కిసాన్, ఆత్మనిర్భర్ లైవ్స్ నినాదాన్ని ఇచ్చిన విషయాన్ని మోడీ ప్రస్తావించారు.

నేపాల్, బంగ్లాదేశ్  కమ్యూనికేషన్ సౌకర్యాలు పెంచే పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.  జాతీయ రహదారులు, జల మార్గాలు, బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.

ప్రతి ఏటా ఇదే విధంగా సంతోషంగా, ఉత్సాహంగా దుర్గా పూజ కార్యక్రమాలు జరుపుకోవాలని తాను కోరుకొంటున్నట్టుగా ప్రధాని చెప్పారు.మహిళలు దుర్గామాతకు ప్రతీకలుగా ఆయన అభిప్రాయపడ్డారు. మహిళా సాధికారిత కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 

రూ. 8500 కోట్లతో కోల్ కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో  కు కేంద్రం ఆమోదం తెలిపిందని ఆయన తెలిపారు. బెంగాల్ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చేసేందుకు తాము నిరంతరం పనిచేస్తున్నామన్నారు.

ప్రధానమంత్రి అవాస్ యోజన కింద  30 లక్షల మంది పేదలకు ఇళ్లు కట్టించినట్టుగా ఆయన చెప్పారు. 90 లక్షల మందికి ఉజ్వల యోజన స్కీమ్ కింద ఉచితంగా గ్యాస్ ను సరఫరా చేశామన్నారు.