Madhya Pradesh's Forest: మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఓ ఎలుగుబంటి దాడి చేసి దంపతులను చంపి.. వారి మృతదేహాలను తిన్నట్టు అధికారి తెలిపారు. ఎలుగుబంటి శరీర భాగాలను తింటుండగా దాన్ని తరిమికొట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, దాదాపు 5 గంటలపాటు శ్రమించి ఆ ఎలుగుబంటిని పట్టుకున్నట్టు అధికారులు చెప్పుతున్నారు.
Madhya Pradesh's Forest: మధ్యప్రదేశ్ అడవుల్లో హృదయ విదారక ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున దైవ దర్శనానికి వెళ్ళిన దంపతులపై ఓ ఎలుగుబంటి దాడి చేసి.. చంపింది. అంతటితో ఆ ఎలుగుబంటి ఆగకుండా.. ఆ దంపతుల మృతదేహాలను తినేసింది. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది.. ఎలుగుబంటిని తరిమికొట్టేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దాదాపు ఐదు గంటపాటు శ్రమించి ఎట్టకేలకు ఆ ఎలుగుబంటిని పట్టుకున్నారు. ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతోంది. అత్యంత భయాందోళనల కలిగించే ఈ ఘటన పన్నా జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగింది.
వివరాల్లోకెళ్తే.. రాణిగంజ్ ప్రాంతానికి చెందిన ముఖేష్ రాయ్ (50), అతని భార్య గుడియా (45 ) పన్నానగరం అటవీ ప్రాంతంలో ఉన్న ఖర్మాయి మాత ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లారు. ఈ సమయంలో గుడి సమీపంలో ఆ దంపతులపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడి తీవ్రగాయపడిన వారిని అడవిలోనికి ఈడ్చుకెళ్లింది. అనంతరం.. వారిని తినడం ప్రారంభించింది. దీంతో దంపతులు మృతి చెందారు.
దంపతులు మరణించిన 3-4 గంటల తర్వాత కూడా ఎలుగుబంటి మృతదేహాలపై దాడి చేసి తిన్నట్టు స్థానికులు చేబుతున్నారు. సమాచారం అందుకున్న తరువాత ఆలస్యంగా అటవీ సిబ్బంది రాకపోవడంతో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అనంతరం రంగంలోకి దిగిన పన్నా టైగర్ రిజర్వ్ బృందం సుమారు 3 గంటల పాటు శ్రమించి.. ఎలుగుబంటిని అపస్మారక స్థితికి చేర్చి.. బోనులో బంధించింది.
ఈ ఘటనపై నార్త్ ఫారెస్ట్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డిఎఫ్‌ఓ) గౌరవ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. మేం పన్నా టైగర్ రిజర్వ్ బృందాలకు సమాచారం అందించాం. ఎలుగుబంటిని పట్టుకొని, జంట మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. ఎలుగుబంటిని ఏదైనా జంతు ప్రదర్శనశాలకు పంపాలని భావిస్తున్నామని గౌరవ్ చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దంపతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹ 4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని గౌరవ్ శర్మ చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన బంధువులు కూడా కొంత సేపు గొడవ చేసి.. ఆ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు ఆశ్రిత వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ ఎలుగుబంటి దాడిలో మృతి చెందిన దంపతుల బంధువులను పరామర్శించి కుటుంబ సభ్యులకు అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అదే సమయంలో నగరానికి అనుకుని ఉన్న ప్రాంతంలో నరమాంస భక్షక ఎలుగుబంటి దాడి ఘటనతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
