Asianet News TeluguAsianet News Telugu

Monkeypox: మంకీపాక్స్.. అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ కేర‌ళ ఆరోగ్య మంత్రి ఆదేశాలు

Monkeypox: మంకీపాక్స్ ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో ఆరోగ్య శాఖ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి అవసరమైన ముందస్తు చర్యలను ప్రారంభించిందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
 

Be Vigilant : Kerala Health Minister Directs Officials On Monkeypox
Author
Hyderabad, First Published May 22, 2022, 1:58 AM IST

Kerala Health Minister Veena George: ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ తో పోరాడుతున్న ప్ర‌పంచ దేశాలను ఇప్పుడు  మంకీపాక్స్ వ‌ణికిస్తోంది. ప్ర‌స్తుతం ప‌లు దేశాల్లో మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ఆయా దేశాల ఆరోగ్య సంస్థ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రిస్తున్నాయి. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సైతం ప‌లు దేశాల్లో ప్ర‌స్తుతం మంకీపాక్స్ కేసులు ఆందోళ‌న‌క‌రంగా న‌మోద‌వుతున్నాయ‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలోనే భార‌త్ సైతం అప్ర‌మ‌త్త‌మైంది. కొన్ని దేశాల నుంచి నమోదవుతున్న మంకీపాక్స్ కేసులను నిశితంగా పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)ల‌ను ఇప్పటికే ఆదేశించింది. మంకీపాక్స్ పై నిఘా ఉంచాలని కోరింది. మంకీపాక్స్ లక్షణాలతో ఉన్న ప్రయాణికుల నమూనాలను తదుపరి పరీక్ష కోసం పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి)కి పంపాలని ప్రభుత్వం కోరింది. రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని తెలిపింది. 

ఈ క్ర‌మంలోనే కేంద్ర మంకీపాక్స్ గురించి హెచ్చ‌రించిన ఒక రోజు త‌ర్వాత.. కేరళ ప్ర‌భుత్వం సైతం మంకీపాక్స్ నేప‌థ్యంలో చ‌ర్య‌లు ప్రారంభించింది. కేర‌ళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించారు. రాష్ట్రంలోని అంద‌రూ  అప్రమత్తంగా ఉండాల‌ని పేర్కొంటూ..  వ్యాధి పట్ల అవగాహన కల్పించాలని  జిల్లా అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వైద్యారోగ్య శాఖ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి అవసరమైన ముందస్తు చర్యలను ప్రారంభించిందని మంత్రి తెలిపారు. ఇంతకుముందు ఆఫ్రికాలోనే గుర్తించిన మంకీపాక్స్ ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వేగంగా వ్యాపించడం ప్రారంభించినందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి, నివారణ చర్యలపై అవగాహన కలిగి ఉండాలని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. మంకీపాక్స్ లక్షణాలు మశూచి కంటే చాలా తక్కువగా ఉన్నాయని మంత్రి జార్జ్ అన్నారు. తాము అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని వెల్ల‌డించారు. 

కొన్ని దేశాల నుండి మంకీపాక్స్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పరిస్థితిని నిశితంగా పరిశీలించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా శుక్రవారం NCDC మరియు ICMRలను ఆదేశించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ఎయిర్‌పోర్ట్, పోర్ట్ హెల్త్ ఆఫీసర్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. మంకీపాక్స్ సాధారణంగా జ్వరం, దద్దుర్లు మరియు వాపు శోషరస కణుపులతో అనారోగ్యాన్ని క‌లుగ‌జేస్తుంది. ఇది క్ర‌మంగా అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చున‌ని తెలిపింది. మంకీపాక్స్ వ్యాధి ల‌క్ష‌ణాలు రెండు నుంచి నాలుగు వారాల వ‌ర‌కు ఉంటాయి. ఇటీవలి కాలంలో మంకీపాక్స్ కేసులు మరణాల నిష్పత్తి 3-6 శాతంగా ఉందని WHO పేర్కొంది. అయితే, ఇది మ‌రింత తీవ్రంగా మారే అవ‌కాశంకూడా ఉంద‌ని హెచ్చ‌రించింది. 

మంకీపాక్స్ అంటే ఏమిటి?

మంకీపాక్స్ అనేది మానవ మశూచిని పోలి ఉండే విభిన్న రకాల వైరల్ ఇన్ఫెక్షన్. ఇది మొదటిసారిగా 1958లో కనుగొనబడింది. 1970లో మంకీపాక్స్‌తో సంక్రమించిన మొదటి కేసు నమోదైంది. ఈ వ్యాధి ప్రధానంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని వర్షారణ్య ప్రాంతాలలో సంభవిస్తుంది. కొన్నిసార్లు ఇది ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తుంది. ప్రస్తుతం ఆఫ్రికా వెలుపల, అమెరికా, యూరప్, సింగపూర్, బ్రిటన్‌లలో మంకీపాక్స్ కేసులు ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios