చైనా నుంచి బీబీసీకి భారీ ఎత్తున నిధులు.. జెఠ్మలానీ సంచలన ఆరోపణలు..
సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలానీ ట్విటర్‌లో మీడియా నివేదిక లింక్‌ను షేర్ చేస్తూ బిబిసి ఎందుకు భారతదేశానికి వ్యతిరేకం? ఎందుకంటే భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి BBCకి చాలా డబ్బు అవసరం. దీని కోసం చైనా కంపెనీ Huawei నుండి డబ్బు పొందుతుందని సంచలన ఆరోపణలు చేశారు

గుజరాత్ అల్లర్ల వివాదం, ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ బీబీసీ ఓ వివాదాస్పద డాక్యుమెంటరీ రూపొందించింది. ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ప్రతిపక్షాలు బీబీసీకి అండగా నిలుస్తుంటే.. అధికార బీజేపీ విమర్శలు గుప్పిస్తుంది. తాజాగా బీబీసీ డాక్యుమెంటరీపై బీజేపీ రాజ్యసభ ఎంపీ, సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా కంపెనీ నుంచి డబ్బులు తీసుకుని బ్రిటీష్ బ్రాడ్‌కాస్టర్ బీబీసీ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా డాక్యుమెంటరీని రూపొందించిందని మహేశ్ జెఠ్మలానీ ఆరోపించారు.
భారత్‌పై చైనా ఎజెండాను బీబీసీ ముందుకు తీసుకువెళుతోందని, ప్రధాని మోదీ ప్రతిష్టను దిగజార్చేందుకు చైనా ప్రయత్నిస్తుందని అన్నారు. సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలానీ తన ట్విటర్ హ్యాండిల్ లో మీడియా నివేదిక లింక్‌ను పంచుకుంటూ.. బిబిసి భారతదేశానికి ఎందుకు వ్యతిరేకమని ప్రశ్నించారు. ఎందుకంటే భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి బీబీసీకి చాలా డబ్బు అవసరం. దీని కోసం చైనా డబ్బు పొందుతుంది. BBC అమ్మకానికి ఉందని పేర్కొన్నారు.
అంతకుముందు మరో ట్వీట్‌లో .. 2021లో జమ్మూ కాశ్మీర్ లేకుండా బిబిసి విడుదల చేసిన భారతదేశ మ్యాప్‌ను షేర్ చేశారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో బీబీసీ క్షమాపణలు చెప్పింది. అనంతరం భారత మ్యాప్‌ను కూడా సరిదిద్దింది. భారతదేశానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన సుదీర్ఘ చరిత్ర BBCకి ఉంది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తీసిన డాక్యుమెంటరీ ఈ దురదృష్టాన్ని మరింతగా పెంచడమేనని మహేష్ జెఠ్మాలానీ పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ దుష్ప్రచారం...
భారతదేశంలో గుజరాత్ అల్లర్ల ఆధారంగా రూపొందించిన వివాదాస్పద బిబిసి డాక్యుమెంటరీ 'ఇండియా: ది మోడీ క్వశ్చన్'పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. దీని మొదటి ఎపిసోడ్ జనవరి 17న యూట్యూబ్‌లో విడుదల కాగా, రెండవ ఎపిసోడ్ జనవరి 24న విడుదల కానుంది. అయితే దీనికి ముందు ప్రభుత్వం దీనికి సంబంధించిన అన్ని లింక్‌లను నిషేధించింది.
భారత ప్రభుత్వం బీబీసీ డాక్యుమెంటరీని ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా చేసిన ప్రచారంగా అభివర్ణించింది. అదే సమయంలో వివాదాస్పద BBC డాక్యుమెంటరీని భారతదేశంలో నిషేధించడాన్ని ప్రతిపక్ష పార్టీలు, పలు విద్యార్థి సంస్థలు వ్యతిరేకించాయి. దేశవ్యాప్తంగా పలు యూనివర్శిటీల్లో డాక్యుమెంటరీని నిషేధించినందుకు నిరసనగా విద్యార్థి సంఘాలు కూడా డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ప్రయత్నించాయి. దీనిపై పెద్దఎత్తున ఉత్కంఠ కూడా నెలకొంది.