క్యారీ బ్యాగ్ కి అదనంగా డబ్బు వసూలు చేసినందుకు ప్రముఖ చెప్పుల కంపెనీ బాటాకు భారీ జరిమానా విధించారు. ఒకప్పుడు షాపింగ్ చేస్తే.. కంపెనీ వాళ్లే క్యారీ బ్యాగుల్లో పెట్టి మరీ ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఏం షాపింగ్ చేసినా.. క్యారీ బ్యాగ్ కి అదనంగా రూ.2, రూ.3, రూ.5 బిల్లు వేస్తున్నారు. ఆ అదనంగా చెల్లించే క్యారీ బ్యాగుపై మాత్రం సదరు కంపెనీ లోగ్ ని మాత్రం వేసుకుంటారు. అంటే.. మనం డబ్బులు చెల్లించి మరీ క్యారీ బ్యాగ్ కొని కంపెనీకి పబ్లిసిటీ చేస్తున్నట్లు లెక్క. అందుకే ఓ వ్యక్తి దీనిపై వినియోగదారుల ఫోరం ను ఆశ్రయించాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. చండీగఢ్‌కి  చెందిన  దినేష్‌ ప్రసాద్‌ ఫిబ్రవరి 5న స్థానికంగా ఉన్న బాటా దుకాణంలో చెప్పులు కొన్నాడు. బిల్లులో చెప్పుల ధరతో పాటు క్యారీ బ్యాగ్‌కు రూ.3 వసూలు చేశారు. దీంతోపాటు ఆ బ్యాగ్‌పై బాటా ఉత్పత్తులను ముద్రించి ప్రచారం చేస్తున్నారు. ఇదేంటని దినేశ్‌ అడగ్గా.. దుకాణదారులు విసురుగా సమాధానం ఇచ్చారు. దీంతో దినేష్‌ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. 

క్యారీ బ్యాగ్‌కు రూ.3 వసూలు చేసినా ఇబ్బంది లేదు కానీ, దానిపై ఆ సంస్థ ఉత్పత్తులను ముద్రించారని, ఇది వినియోగదారులను మోసం చేయడమేనని ఆయన ఫిర్యాదు చేశాడు. కేసును విచారించిన ఫోరం.. దినేష్‌కు రూ.9 వేల పరిహారంతో పాటు క్యారీ బ్యాగ్‌ చార్జీ కూడా వెనక్కి ఇచ్చేయాలని బాటా దుకాణదారులను ఆదేశించింది.