హైదరాబాద్‌ మైలార్‌దేవ్‌పల్లిలో ఐసిస్ సానుభూతిపరుడు మహ్మద్ అబ్దుల్లా బాసిత్‌ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. విచారణలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

బాసిత్ రెండో మైమునా ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి మహారాష్ట్రలోని ఒక ఆర్ఎస్ఎస్ నేతను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ గుర్తించింది. బాసిత్ అరెస్ట్ తర్వాత హైదరాబాద్‌లో ఉన్న ఇస్లామిక్ స్టేట్ సానుభూతిపరులతో మైమునా సమావేశమైనట్లుగా అనుమానిస్తున్నారు.

మహారాష్ట్రలోని వార్థాకు చెందిన మైమునా సోషల్ మీడియా ద్వారా ఐఎస్ భావజాలానికి ఆకర్షితురాలైంది. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా ఐఎస్ ఉగ్రవాదులతో ఆమె చాటింగ్ చేసేది. ఈ క్రమంలోనే మైమునాకు బాసిత్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

మైమునా సోషల్ మీడియా ద్వారా ఐఎస్ భావజాలాన్ని వ్యాపింపజేసేది. గతేడాది ఆగస్టులో బాసిత్ అరెస్ట్ తర్వాత ఆమె ఆజ్ఞాతంలోకి వెళ్లింది. కొద్దిరోజుల తర్వాత కూడా ఆమె ఐఎస్ గ్రూపులను నిర్వహించింది.

మైమునా కదలికలను పసిగట్టిన ఎన్ఐఏ.. శనివారం వార్థాలో ఆమె ఇంట్లో తనిఖీలు చేసి పలు ఆధారాలను స్వాధీనం చేసుకుంది. బాసిత్-మైమునా కలిసి ఇండియాలో ఇస్లామిక్ స్టేట్ కార్యకలాపాలను విస్తరించాలని స్కెచ్ వేసినట్లుగా గుర్తించారు. ఆమె ఇంట్లో స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లలోని డేటాను అధికారులు విశ్లేషిస్తున్నారు.