Asianet News TeluguAsianet News Telugu

ముస్లింల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. రామ్ దేవ్ బాబాపై కేసు న‌మోదు

Barmer: ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్ పై కేసు నమోదు అయింది. ముస్లింలపై విద్వేషవ్యాఖ్యలు చేసినందుకు ఆయ‌న‌పై కేసు న‌మోదైంది.  రాజస్థాన్‌లోని బార్మర్‌లో జరిగిన కార్యక్రమంలో రామ్‌దేవ్ బాబా ముస్లింలపై ద్వేషపూరిత వ్యాఖ్య‌లు చేశారు. టోంక్‌లోని కలెక్టరేట్ ప్రాంగణంలో బాబా రామ్‌దేవ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 

Barmer : Controversial comments against Muslims.. Case registered against Ram Dev Baba
Author
First Published Feb 6, 2023, 11:41 AM IST

Yoga guru Ramdev booked: ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్ పై కేసు నమోదు అయింది. ముస్లింలపై విద్వేషవ్యాఖ్యలు చేసినందుకు ఆయ‌న‌పై కేసు న‌మోదైంది.  రాజస్థాన్‌లోని బార్మర్‌లో జరిగిన కార్యక్రమంలో రామ్‌దేవ్ బాబా ముస్లింలపై ద్వేషపూరిత వ్యాఖ్య‌లు చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పై ఫిర్యాదు అంద‌డంతో పోలీసులు కేసు న‌మోదుచేశారు. స్థానిక నివాసి పథాయ్ ఖాన్ ఫిర్యాదు చేయడంతో చౌహతాన్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 

చౌహతాన్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో భూతారామ్ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. ఐపీసీ సెక్షన్లు 153ఏ,  (మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 295ఏ (ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశపూరిత చర్యలు, మతం లేదా మత విశ్వాసాలను అవమానించడం ద్వారా ఏదైనా వర్గ మత భావాలను కించపరిచే ఉద్దేశం), 298 (ఏదైనా విధంగా వ్యక్తి మతపరమైన భావాలను గాయపరిచే ఉద్దేశంతో ఉచ్చరించడం, వ్యాఖ్య‌లు చేయ‌డం మొదలైనవి) కింద కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 2న జరిగిన పీఠాధిపతుల సమావేశంలో రాందేవ్ బాబా హిందూ మతాన్ని ఇస్లాం, క్రిస్టియానిటీతో పోలుస్తూ ముస్లింలు ఉగ్రవాదానికి పాల్పడుతున్నారని, హిందూ మహిళలను అపహరించుతున్నారని ఆరోపించారు. రెండు మతాలు మతమార్పిడుల జోలికి వెళ్లాయనీ, హిందూ మతం తన అనుచరులకు మంచి చేయమని నేర్పిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆయ‌న వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ కావ‌డంతో ఆయ‌నపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 

రామ్ దేవ్ బాబా వ్యాఖ్య‌లకు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు.. 

రాజస్థాన్ పర్యటనకు వచ్చిన యోగా గురు బాబా రామ్‌దేవ్ ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా నమాజ్‌పై వ్యాఖ్యానించడం కొత్త వివాదం రేపింది. బాబా వివాదాస్పద మాటలతో దేశ వ్యాప్తంగా రాజకీయం వేడెక్కింది. రాష్ట్రంలోనూ చాలా చోట్ల బాబాపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. టోంక్ కలెక్టరేట్‌లో, ముస్లిం సమాజం, న్యాయవాదులు రామ్ దేవ్ బాబా వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర మైనారిటీ కమిషన్ కూడా బాబా మాటలపై అసహనం వ్యక్తం చేసింది.

రామ్‌దేవ్ బార్మర్‌లో ఏమ‌న్నారంటే.. 

బార్మర్‌లో జరిగిన ఒక మతపరమైన సభలో ప్రసంగిస్తూ స్వామి రామ్‌దేవ్ ఇస్లాం, ముస్లింలకు వ్యతిరేకంగా వివాదాస్పద ప్రకటన చేశారు. మతపరమైన ఫోరమ్‌లో ఆయన మాట్లాడుతూ 'ఇస్లాం మతం అంటే నమాజ్ చేయడం మాత్రమే. ముస్లింలు నమాజ్ చేయడం మాత్రమే అవసరం. నమాజ్ చేసిన తర్వాత, మీరు ఏమి చేసినా, ప్రతిదీ సమర్థించబడుతుంది. మీరు హిందూ అమ్మాయిలను ఎత్తుకెళ్లినా, జిహాద్ పేరుతో తీవ్రవాదులుగా మారినా, మీ మనసులో ఏది అనిపిస్తే అది చేయండి, కానీ రోజుకు 5 సార్లు నమాజ్ చదవండి. అప్పుడు ప్రతిదీ సమర్థించబడుతోంది అంటూ వ్యాఖ్యానించారు. 


రఫీక్ ఖాన్ ఫైర్.. 

రాజస్థాన్ మైనారిటీల కమిషన్ ఛైర్మన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే రఫీక్ ఖాన్.. రామ్ దేవ్ బాబా ప్రసంగాన్ని ఖండించారు. ఆయన వ్యాఖ్య‌ల‌ను మ‌రో కుట్ర‌గా అభివ‌ర్ణించారు. మీడియాతో ఖాన్ మాట్లాడుతూ.. "కేంద్ర ప్రభుత్వ అండ‌తో రామ్‌దేవ్ కంపెనీలు పురోగమిస్తున్నాయని, అందుకే ఆయనను రాజస్థాన్‌లో మతతత్వం, కులతత్వం వ్యాప్తి చేసేందుకు పంపారని అన్నారు. వారు కుట్రతో రాజస్థాన్‌కు వచ్చారు. యోగా గురువు ఏ మతానికి వ్యతిరేకంగా అయినా తప్పుడు వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుచేటు. ఏ మతమూ శత్రుత్వాన్ని బోధించదు. బాబా రామ్‌దేవ్‌పై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ చర్యలు తీసుకోవాలి" అని అన్నారు. 

టోంక్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.. 

టోంక్‌లోని కలెక్టరేట్ ప్రాంగణంలో బాబా రామ్‌దేవ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మత సామరస్యానికి భంగం కలిగించే పని రామ్‌దేవ్ చేశారని అన్నారు. రామ్‌దేవ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. దీని తరువాత, న్యాయవాదులు కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బాబా రామ్‌దేవ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లిఖితపూర్వక నివేదిక ఇచ్చారు. న్యాయవాదుల నివేదికపై ఫిర్యాదు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నంద్ సింగ్ తెలిపారు. దీనిపై విచారణ జరుపుతామన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios