అడిగినంత కట్నం ఇవ్వలేదనే కోపంతో ఓ అల్లుడు పిల్లనిచ్చిన అత్త ముక్కు కొరికేశాడు. అంతటితో ఆగకుండా... తన తండ్రి చేత అత్త చెవులు కూడా కోయించేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బరేలికి చెందిన మహ్మద్ అష్భక్ అనేక బిజినెస్ చేస్తుంటాడు. అతనికి ఏడాది క్రితం చాంద్ బీ అనే యువతితో వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.10లక్షల కట్నం ఇచ్చేందుకు చాంద్ బీ తండ్రి రెహమాన్ ఒప్పుకున్నాడు. అన్నమాట ప్రకారం  ఆ మొత్తాన్ని ఇచ్చేశాడు కూడా. ఇటీవల ఆ దంపతులకు ఓ పాప పుట్టింది. 

అప్పటి నుంచి మరో రూ.5లక్షలు కట్నం అదనంగా తీసుకురావాలని మహ్మద్ భార్య చాంద్ బీని వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రెచ్చిపోయిన మహ్మద్... భార్య చాంద్ బీపై చెయ్యి చేసుకున్నాడు. దీంతో ఆమె ఈవిషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేసింది.

వారు కూతురు, అల్లుడు ఇంటికి వచ్చి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మహ్మద్ వారు చెప్పేమాట వినకపోగా... చాంద్ బీ తల్లిదండ్రులపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఎదురు తిరిగినందుకు చాంద్ బీ తల్లి ముక్కును మహ్మద్ కొరికేశాడు. ఆమె  చెవులను తన తండ్రి చేత కత్తితో కట్ చేయించాడు. తీవ్ర రక్త స్రావం కావడంతో ఆమె స్పృహ కోల్పోయింది.

దీంతో ఆమె ప్రాణాలు పోతే తమ మెడకు చుట్టుకునే అవకాశం ఉందని అక్కడి నుంచి మహ్మద్, అతని తండ్రి పరారయ్యారు. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.