ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. బార్ కౌన్సిల్ అధ్యక్షురాలిని తోటి న్యాయవాది కోర్టు ప్రాంగణంలోనే కాల్చి చంపాడు. వివరాల్లోకి వెళితే.. రెండు రోజులు క్రితం జరిగిన బార్ కౌన్సిల్ ఎన్నికల్లో దార్వేష్ యాదవ్ అధ్యక్షురాలిగా ఎన్నికై ఈ పదవి చేపట్టనున్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు.

ఈ క్రమంలో ఆమె తన తోటి న్యాయవాది మనీశ్ శర్మతో కలిసి ఇతర న్యాయవాదులకు ధన్యవాదాలు చెప్పేందుకు వెళ్లారు. సీనియర్ న్యాయవాది అరవింద్ మిశ్రా ఛాంబర్‌లో దర్వేశ్, మనీశ్‌ల మధ్య వాగ్వాదం జరిగింది.

మాటా మాటా పెరగడంతో మనీశ్ కొద్దిక్షణాల్లోనే ఆగ్రహానికి గురైయ్యాడు. వెంటనే తన దగ్గరున్న తుపాకీని బయటకు తీసి... దర్వేశ్‌పై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.  

అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. దీంతో న్యాయవాదులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడ్డ మనీశ్‌ను ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ హత్యకు గల కారణాల గురించి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.