హిట్‌లిస్ట్‌లోని వారిని టార్గెట్ చేస్తామని లష్కర్ ముసుగు సంస్థ టీఆర్ఎఫ్ ప్రకటన.. కశ్మీర్ పండిట్లకు ముప్పు?
జమ్ము కశ్మీర్‌లోని ది రెసిస్టెన్స్ ఫ్రంట్.. పాకిస్తాన్‌కు చెందిన లష్కర్ ఏ తాయిబా ఉగ్రవాద సంస్థకు అనుబంధమైనదని దానిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ మరుసటి రోజే ది రెసిస్టెన్స్ ఫ్రంట్.. తాము అప్‌లోడ్ చేసిన హిట్‌లిస్టులోని వారిపై దాడికి ఇప్పటికే తమ క్యాడర్ పనిలోకి దిగిందని ఓ ప్రకటనలో పేర్కొంది.

న్యూఢిల్లీ: ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఒక ఉగ్రవాద సంస్థ అని, అది పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న లష్కర్ ఏ తాయిబా ఉగ్రవాద సంస్థకు అనుబంధమైన ఆర్గనైజేషన్ అని దానిపై కేంద్ర హోం వ్యవహారాల శాఖ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధం విధించిన రోజే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ తన హిట్‌లిస్ట్‌లోని వారిని టార్గెట్ చేస్తామని, తాము హెచ్చరించబోమని, యాక్ట్ చేస్తామని ఓ ప్రకటనలో వివరించింది. అంతేకాదు, దానికి లష్కర్ ఏ తాయిబా సంస్థతో సంబంధం లేదని, తమది లోకల్ సంస్థ అని ఒప్పించే ప్రయత్నం ఆ ప్రకటనలో ఉన్నది.
ఈ ప్రకటనలో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇంటర్నెట్‌లో ఆ సంస్థ అప్‌లోడ్ చేసిన హిట్ లిస్టును ప్రస్తావించింది. హిట్‌లిస్ట్ లోని వారిపై ఇప్పటికే తమ క్యాడర్ పని చేస్తున్నదని పేర్కొంది. తాము వార్నింగ్ ఇవ్వమని, డైరెక్ట్‌గా యాక్షన్‌లోకి దిగుతామని తెలిపింది.
కొంత కాలంగా జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాద ఘటనలు లక్షిత దాడులవే జరుగుతున్నాయి. అందులోనూ కశ్మీరీ పండిట్లు, కశ్మీరేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. ఈ సంస్థలు ప్రత్యేకంగా వారినే టార్గెట్ చేసుకుని దాడులకు తెగబడుతున్నాయి. దీంతో హిట్‌లిస్టును అప్‌లోడ్ చేయడమే కాదు.. వారిపై దాడులకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించామని ఆ ఉగ్రవాద సంస్థ ప్రకటనలో పేర్కొనడంతో కశ్మీర్ పండిట్లకు ముప్పు తప్పదా? అనే భయాలు నెలకొంటున్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నది. జమ్ము కశ్మీర్‌లో పౌరుల రక్షణకు నిరంతరం ఆర్మీ పని చేస్తూనే ఉన్నది. ఈ క్రమంలో ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను గుర్తించి నిషేధించింది.
Also Read: కాశ్మీరీ పండిట్ల భద్రత గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ ఆందోళన.. బీజేపీ సర్కారుపై ఫైర్
కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ ప్రకారం, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆన్‌లైన్ మీడియం ద్వారా యువతను రిక్రూట్ చేసుకుని తమ ఉగ్ర కార్యకలాపాలను మరింత పెంచుకుంటున్నది. పాకిస్తాన్ నుంచి జమ్ము కశ్మీర్‌లోకి ఆయుధాలు, మాదకద్రవ్యాలను తీసుకురావడం, ఉగ్రవాదులను సరిహద్దు గుండా దిగుమతి చేసుకోవడంలో క్రియాశీలకంగా ఉన్నదని కేంద్రం తెలిపింది. 2019లో ఈ నిషేధిత ఉగ్రవాద సంస్థ ఉనికిలోకి వచ్చినట్టు వివరించింది.