హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని అసెంబ్లీ గేటు, గోడలపై ఖలిస్తాన్ జెండాలు నిన్న వెలుగుచూడటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ జెండాలను తామే పంపామని, అరవింద్ కేజ్రీవాల్ నిర్వహించిన సభకు హాజరైన తమ కార్యకర్తలే ఈ జెండాలను తీసుకెళ్లారని తాజాగా ఓ వీడియోలో వేర్పాటువాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ వెల్లడించింది. 

న్యూఢిల్లీ: నిషేధిత సిక్కుల సంస్థ, వేర్పాటువాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ ఓ వీడియోలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లో ధర్మశాలలోని అసెంబ్లీ కాంప్లెక్స్ గోడలపైకి తమ జెండాల తరలింపునకు.. కేజ్రీవాల్ ర్యాలీకి లింక్ వెల్లడించింది. కేజ్రీవాల్ మండీలో జనసభను నిర్వహించారు. ఈ సభకు పంజాబ్ నుంచి సీఎం భగవంత్ మన్ వెళ్లారు. ఆయనతోపాటుగా అనేక మంది ఆప్ కార్యకర్తలు, ఇతరులు ఆ సభకు హాజరవ్వడానికి బయల్దేరి వెళ్లారు.

ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నిర్వహించిన ర్యాలీలో హాజరుకావడానికి వెళ్లినవారితోనే తామూ తమ కార్యకర్తలను ఖలిస్తాన్ జెండాలతో పంపామని సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో వెల్లడించింది. అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మన్‌లు ఇరువురూ ఖలిస్తాన్ సిక్కులకు అనుకూలంగా వ్యవహరించారని, వారు ఖలిస్తాన్ అనుకూల సిక్కుల నుంచి 6 మిలియన్ డాలర్ల విరాళాలు రాబట్టారని వివరించింది. పంజాబ్ ఎన్నికల సమయంలో ఆప్ ఈ మొత్తాన్ని జమ చేసిందని పేర్కొంది. కాబట్టి, సీఎం భగవంత్ మన్‌కు సన్నిహితంగా ఉండే సిఖ్స్ ఫర్ జస్టిస్ కార్యకర్తలను సమర్థంగా వినియోగించుకుంటామని వివరించింది. ఖలిస్తాన్ రెఫరెండమ్ నిర్వహించడానికి ఈ కార్యకర్తలను తాము ఉపయోగించుకుంటామని సిఖ్స్ ఫర్ జస్టిస్ జనరల్ కౌన్సెల్ గురుపట్వంత్ సింగ్ పన్నున్ ఆ వీడియోలో తెలిపారు.

ధర్మశాలలో అసెంబ్లీ గోడలపై ఖలిస్తాన్ జెండాలు హిమాచల్ ప్రదేశ్ సీఎం జై రాం ఠాకూర్‌కు నేరుగా సందేశాన్ని ఇచ్చాయని సిఖ్స్ ఫర్ జస్టిస్ జనరల్ కౌన్సెల్ చెప్పారు. ఖలిస్తాన్ రెఫరెండమ్ ద్వారా హిమాచల్ ప్రదేశ్‌ను దక్కించుకుంటామని, ఆ రాష్ట్రం మళ్లీ పంజాబ్‌లో అంతర్భాగం అవుతుందని వివరించారు. 

సిఖ్స్ ఫర్ జస్టిస్ 2022 జూన్‌లో ఆపరేషన్ బ్లూస్టార్‌కు 38 ఏళ్లు నిండిన సందర్భంగా ఓ ప్రకటన చేశాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఖలిస్తాన్ రెఫరెండమ్ కోసం ఓటింగ్ నిర్వహించడానికి ఓ తేదీని ప్రకటిస్తామని ఆ వేర్పాటువాద సంస్థ వెల్లడించింది.

ఇదిలా ఉండగా, ఖలిస్తాన్‌లు దుశ్చర్యకు పాల్పడ్డారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గేటుపై ఖలిస్తాన్‌ల జెండాను ఉంచారు. అసెంబ్లీ సరిహద్దు గోడలపై ఖలిస్తాన్ అనుకూల రాతలు రాశారు. ఈ రోజు ఉదయం ఖలిస్తాన్ జెండాలు, రాతలు అసెంబ్లీ గేటు, గోడలపై కనిపించాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై సీఎం జైరాం ఠాకూర్ సీరియస్ అయ్యారు. బహుశా పంజాబ్ నుంచి రాష్ట్రంలోకి వచ్చిన పర్యాటకులు పని అయి ఉంటుందని పోలీసులు అనుమానించారు.

హిమాచల్ ప్రదేశ్‌లో శీతాకాల సమావేశాలు నిర్వహించే ధర్మశాలలోని అసెంబ్లీ భవనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బహుశా మొన్న రాత్రి లేదా నిన్న తెల్లవారుజామున ఈ ఘటన జరిగి ఉండొచ్చని కంగ్రా రీజియన్ పోలీసు చీఫ్ ఖుశల్ శర్మ వివరించారు.

ఖలిస్తాన్ అనుకూల ఉగ్రవాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపట్వంత్ సింగ్ పన్ను పేరిట ఓ లేఖ హిమాచల్ ప్రదేశ్ సీఎంకు లేఖ విడుదల అయిందని, భింద్రాన్వాలే, ఖలిస్తాన్ జెండాలను షిమ్లాలో ఎగరేస్తామని అందులో పేర్కొన్నట్టు నిఘా వర్గాలు తెలిపాయి. దీంతో హిమాచల్ ప్రదేశ్ భింద్రాన్వాలే, ఖలిస్తానీ జెండాలతో వచ్చే వాహనాలను నిషేధంచాయి. ఈ సంస్థ మార్చి 29వ తేదీన ఖలిస్తాన్ జెండా ఎగరేస్తామని పేర్కొంది. కానీ, హెవీ సెక్యూరిటీ కారణంగా ఆ పని చేయలేదని తెలుస్తున్నది.