ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ ని మరో 19 రోజులపాటు పొడిగిస్తున్నట్టు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే లాక్ డౌన్ వల్ల అనేక మంది తమ ఉపాధిని కోల్పోవడమే కాకుండా వేర్ ప్రాంతాల్లో చిక్కుబడిపోయారు. ఇలా చిక్కుబడ్డవారిలో వలస కార్మికులు అధికంగా ఉన్నారు. 

వీరంతా తమ స్వస్థలాలకు వెళ్లలేక, ఇక్కడేమో పని లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ సహాయం అందిన వారి పరిస్థితి మెరుగా ఉన్నప్పటికీ... ఎటువంటి సహాయం అందకుండా రోజు తిండి దొరకడం కూడా కష్టంగా మారినవారు పరిస్థితి మరి దుర్భరంగా ఉంది. 

నిన్న ఇదే విషయాన్నీ ప్రతిబింబిస్తూ బాంద్రా రైల్వే స్టేషన్ బయటకు ఒక్కసారిగా వలస కూలీలంతా వచ్చారు. తమను ఇండ్లకు పంపించి వేయాలంటూ వారు డిమాండ్ చేసారు. ఇలా ఒక్కసారిగా వారంతా బయటకు రావడం, అందునా కరోనా సమయం అవడం వల్ల పోలీసులు సైతం వారిపై లాఠీ ఛార్జ్ చేసే పరిస్థితిని అదుపులోకి తీసుకురావలిసి వచ్చింది. 

ఇలా వలస కార్మికులంతా రోడ్లపైకి వచ్చారంటే, ముంబై నగర ఎమ్మెల్యేలందరికీ వారు అధికార పక్షమైన, ప్రతిపక్షమైన ఒక ఇబ్బందికర పరిస్థితే. వారు అప్పుడు ఆ ప్రాంతానికి చేరుకొని వారితో పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి ఉంటుంది. 

కానీ నిన్న బాంద్రాలో జరిగిన సంఘటన మాత్రం మనకు పూర్తిగా ఇంకో విషయాన్నీ పరిచయం చేస్తుంది. బాంద్రా ఈస్ట్, బాంద్రా వెస్ట్ ఎమ్మెల్యేలు ఈ పరిస్థితిని అదుపులోకి తేవడాన్ని గాలికి వదిలేసి... ఈ సంఘటన జరిగింది ఈస్ట్, వెస్ట్ అంటూ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. 

వారి రాజకీయాలకు ఇదే తగిన సమయంగా భావించారు కాబోలు, దుమ్మెత్తిపోసుకుంటూ వాస్తవ పరిస్థితిని పూర్తిగా విస్మరించారు. బాంద్రా వెస్ట్ నియోజిక వర్గ బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్ షెలార్ ఈ సంఘటన బాంద్రా ఈస్ట్ లో అయ్యిందని ట్వీట్ చేసాడు.
దీనికి బాంద్రా ఈస్ట్ ఎమ్మెల్యే జీషాన్ సిద్దికీ ఈ సంఘటన  జరిగింది బాంద్రా వెస్ట్ లో అని నీ సొంత నియోజకవర్గాన్ని మర్చిపోయావా అంటూ ట్వీట్ చేసారు. 
ఈ సంఘటన జరిగిన తరువాత ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం ఆ ప్రాంతానికి వెళ్లారు. వారందరితో మాట్లాడి పరిస్థితిని ప్రస్తుతానికైతే సద్దుమణిగేలా చూసారు.