Asianet News TeluguAsianet News Telugu

ప్రత్యేక రాష్ట్రం డిమాండ్.. ఒడిశాలోని పది జిల్లాల్లో బంద్

ఒడిశాలో ప్ర‌త్యేక రాష్ట్ర డిమాండ్ తెర మీద‌కు వ‌చ్చింది. ఒడిశాలోని పది జిల్లాలను కలుపుకుని కోశల్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గత ముప్పై ఏళ్లుగా ఈ ఉద్యమం సాగుతోన్న ఎప్పుడూ తీవ్ర రూపం దాల్చ‌లేదు.

Bandh in 10 Odisha districts demanding separate state
Author
First Published Sep 8, 2022, 6:16 PM IST

ఒడిశాలో ఆస్తిత్వ పోరాటం మ‌రోసారి తెర‌మీద‌కి వ‌చ్చింది. ప్రాంతీయ అసమతుల్యతలను పరిష్కరించడంలో ప్ర‌భుత్వాలు విఫ‌ల‌మ‌య్యాయనీ, త‌మ ప్రాంతాన్ని ప్ర‌త్యేక‌ రాష్ట్రంగా చేయాల‌ని డిమాండ్ చేస్తూ ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మం ఎగిసిప‌డుతోంది. క్ర‌మంగా ఈ ఉద్యమం ఊపందుకుంటుంది. ఒడిశాలోని పది జిల్లాలను కలుపుకుని కోశల్ అనే  రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేది స్థానిక ప్ర‌జా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ పోరాటం దాదాపుగా గత ముప్పై ఏళ్లుగా సాగుతోంది.  కానీ బ‌ల‌మైన నాయ‌క‌త్వం, స‌రైన మార్గ నిర్దేశ‌కం లేక‌పోవ‌డంతో తీవ్ర రూపం దాల్చ‌లేక‌పోతోంది. 

కానీ, తాజాగా.. ఈ ప్ర‌త్యేక రాష్ట్ర‌ ఉద్యమం మ‌రోసారి తెర మీద‌కి వ‌చ్చింది. రాష్ట్రంలోని ప్రాంతీయ అసమతుల్యతలను పరిష్కరించడంలో రాష్ట్ర బిజూ జనతాదళ్ (బిజెడి) ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష పార్టీలు భారతీయ జనతా పార్టీ (బిజెపి), కాంగ్రెస్ ఆరోపించడంతో స్థానిక‌ సంస్థలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ క్ర‌మంలో ఆ ప్రాంతానికి చెందిన రెండు సంస్థలు బుధవారం 10 జిల్లాల్లో బంద్
పాటించాయి. 
 
22 ఏళ్లలో చేసిందేమీ లేదు  

అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, (బీజేపీ నేత, పశ్చిమ ఒడిశాలోని సంబల్‌పూర్ ఎమ్మెల్యే) జేఎన్‌ మిశ్రా మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధానికి కూత‌వేటు దూరంలో నివసిస్తున్నా.. ప్రజల్లో తాము నిర్లక్ష్యానికి గురిచేస్తున్నారనే అభిప్రాయం ఉందని అన్నారు. ఈ భావన సరైనదే.. బీజేడీ ప్రభుత్వం 22 ఏళ్లలో స్థానిక ప్ర‌జ‌ల‌కు చేసింది ఏం లేదని విమ‌ర్శించారు

ప్రత్యేక రాష్ట్ర ఉద్య‌మాన్ని వ్య‌తిరేకించిన‌ కాంగ్రెస్  

పశ్చిమ ఒడిశాలోని బోలంగీర్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నర్సింగ్ మిశ్రా మాట్లాడుతూ,.. తాను ప్రత్యేక రాష్ట్ర ఆలోచనను వ్యతిరేకిస్తున్నాననీ, అయితే ప్రాంతీయ అసమానతలు,ఆర్థిక అసమానతలను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాననీ అన్నారు. కొన్ని ప్రాంతాలను మినహాయిస్తే.. రాష్ట్రంలోని మొత్తం పశ్చిమ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని పేర్కొన్నారు. 

పశ్చిమ ఒడిశాకు చెందిన జలవనరుల శాఖ మంత్రి తుక్కుని సాహు మాట్లాడుతూ.. ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌ల‌ను తిప్పికొట్టారు. ముఖ్యమంత్రి తన 22 ఏళ్ల పాలనలో ఎవరినీ, ఏ ప్రాంతాన్ని ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదనీ, పశ్చిమ ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా.. ఆయన వెళ్లి పరిష్కరించారు. ఇప్పుడు కూడా సమస్య వస్తే పరిష్కరిస్తామ‌ని అన్నారు.

స్తంభించిన‌ జనజీవనం

ఈ నేప‌థ్యంలో ‘వెస్ట్రన్ ఒడిశా యువ మార్చ్, కోశల్ యూత్ కోర్డినేషన్ కమిటీ, కోశల్ స్టేట్ కోర్డినేషన్ కమిటీ, కోశల్ సేన, కోవల్ ముక్తి మోర్చాలు ప్రధానంగా ఆందోళన చేస్తున్నాయి. గురువారం నాడు  పశ్చిమ ఒడిశాలో 12 గంట‌ల పాటు బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో పశ్చిమ ఒడిశాలోని అనేక ప్రాంతాల్లోని  జనజీవనం స్తంభించింది. బార్‌ఘర్, బోలంగీర్, సోనేపూర్, నువాపాడా, కలహండి జిల్లాల్లో బంద్ ప్ర‌భావం అధికంగా క‌నిపించింది. బంద్ కారణంగా ఈ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, కోర్టులు, విద్యాసంస్థలు, బ్యాంకులు, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, మార్కెట్‌లు మూసివేయబడ్డాయి. ర‌వాణా వ్య‌వ‌స్థకు అంత‌రాయం క‌లిగింది. బస్సులు రోడ్లపై తిర‌గ‌లేదు.  అయితే జార్సుగూడ, దేవ్‌గఢ్‌, సుందర్‌గఢ్‌ జిల్లాల్లో బంద్‌ ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేస్తోందని కేఎంఎం అధ్యక్షుడు సాగర్ చరణ్ దాస్ పేర్కొన్నారు. సంబల్‌పూర్‌కు చెందిన హిరాఖండ్ సముఖ్య సంస్థ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు మద్దతు ఇచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios