నిన్ననే అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. ఫలితాలు వెలువడడానికి ఇంకా మూడు రోజుల సమయం ఉంది. ప్రజలు ఓట్లు వేసిన ఈవీఎంలను ఎంతో జాగ్రత్తగా కాపాడాల్సిన అధికారులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈవీఎంను నడిరోడ్డుపైనే వదిలేశారు. ఈ సంఘటన రాజస్థాన్ లోని బారాన్ జిల్లా కిషన్ గంజ్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. శుక్రవారం తెలంగాణ రాష్ట్రంతోపాటు.. రాజస్థాన్ లోనూ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. పోలింగ్ అయిపోయిన తర్వాత బీబీయూఏడీ 41390 సీరియల్ నెంబర్లతో ఉన్న ఈవీఎం నడిరోడ్డుపై పడిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే వచ్చి ఈవీఎంను తీసుకువెళ్లారు.

అయితే.. ఈవీఎం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులపై ఎన్నికల కమిషన్ సస్పెన్షన్ వేటు వేసింది. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లకు తరలిస్తున్న ఈ క్రమంలో ఈ పొరపాటు జరిగిందని కలెక్టర్ ఎస్పీ సింగ్ వెల్లడించారు.