పెళ్లి కొడుకుకు బట్టతల. కానీ, పెళ్లి కూతురు వాళ్లకు చెప్పకుండా దాచారు. తీరా పెళ్లి ఇక జరిగిపోతుందనగా విషయం బయటపడింది. పెళ్లి కూతురు వాళ్లు సీరియస్ అయ్యారు. గొడవ పెట్టుకుని పెళ్లి రద్దు చేసుకుని వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
న్యూఢిల్లీ: వంద అబద్ధాలు చెప్పి అయినా ఒక పెళ్లి జరిపించాలని పెద్దలు చెబుతుంటారు. వంద అబద్ధాలు సంగతి ఏమో కానీ, ఒక్కోసారి ఒక్క అబద్ధమే పెళ్లిని చిందరవందర చేసేస్తుంది. వీటిని చూస్తే అబద్ధాల తీవ్రతనూ పరిగణనలోకి తీసుకోవాలేమో అనిపిస్తుంది. కానీ, ఒక్కో అబద్ధం అందరికీ ఒకే తీవ్రతతో ఉండదు కూడా. కాబట్టి, వీలైనంత వరకు నిజాలు చెప్పి నచ్చచెప్పి ముందడుగు వేయడమే సముచితం. ఎందుకంటే.. ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి తనకు బట్టతల ఉందనే విషయాన్ని పెళ్లి కూతురు వాళ్లకు చెప్పకుండా దాచాడు. అనుకోకుండా అది పెళ్లి పీటలపై బయటపడింది. దీంతో పెళ్లి కూతురు వాళ్లు ఒక్కసారిగా ఉగ్రులయ్యారు. వధువు అయితే.. తాను పెళ్లి చేసుకోనని స్పష్టంగా చెప్పేసింది. ఇంకేం.. ఆ ఒక్క అబద్ధం పెళ్లిని పెటాకులు చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ పెళ్లికి ముహూర్తం ఖరారైంది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఫ్యామిలీస్ అంతా రెడీ అయ్యారు. వధువు, వరుడు పెళ్లి పీటలపై కూర్చున్నారు. పెళ్లి హడావిడిలో, తంతులో పెళ్లి కొడుకు అప్పటికే అలసిపోయాడు. ఈ అలసటతోనే పెళ్లి కొడుకు సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ పెళ్లి కొడుకును లేపడానికి పెళ్లి కూతురు సోదరుడు పరుగున వెళ్లాడు. ముఖంపై నీళ్లు చల్లాడు. తలపాగా తీయబోడయాడు. అంతే.. వరుడి విగ్గు ఊడిపోయింది.
ఈ హఠాత్పరిణామంతో వధువు తరఫు బంధుగణమంతా షాక్ అయ్యారు. పెళ్లి కూతురి నోట మాట రాలేదు. కొంత సేపటికి తేరుకుని పెళ్లి కొడుకుకు బట్టతల ఉన్నదని తమకు ముందుగానే ఎందుకు చెప్పలేదని నిలదీశారు. బట్టతల పెట్టుకుని ఇంతమోసం చేస్తారా? ఏమీ లేనట్టుగా తమ ముందే నటిస్తారా? అంటూ ఆగ్రహం అయ్యారు. కాగా, బట్టతల ఉన్న వ్యక్తిని తాను పెళ్లి చేసుకోనని పెళ్లి కూతురు స్పష్టం చేసింది.
ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితులు ఎక్కడ చేజారి పోతాయేమోననే భయంతో కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు స్పాట్‌కు వచ్చారు. ఇరు పక్షాలకు సర్ది చెప్పారు. గొడవను అయితే ఆపగలిగారు. కానీ, వారి పెళ్లిని మాత్రం జరిపించలేకపోయారు.
దాదాపు ఇక తన పెళ్లి జరిగిపోతుందనే ఆశలో ఉన్న పెళ్లి కొడుకు తీవ్ర నిరాశలో పడిపోయాడు. అతిథులంతా వెనక్కి వెళ్లిపోయారు. పెళ్లి కొడుకుకు బట్ట తల ఉన్నదనే విషయాన్ని ముందుగా చెప్పినా పెళ్లి కూతురు అందుకు సిద్ధమై ఉండేదేమోనని బంధువులు అన్నారు. ఇలా చేసుకోబోయే అమ్మాయిని మోసం చేశాడనే అసహనం ఆమెలో కలిగిందని పేర్కొన్నారు.
