సంచలనం  సృష్టించిన భ‌జ‌రంగ్ దల్ కార్య‌క‌ర్త హర్ష హ‌త్య కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. శివ‌మొగ్గ ప్రాంతంలో ప‌రిస్థితుల‌ను అదుపులో ఉంచేందుకు రెండో రోజుల పాటు క‌ర్ఫ్యూ కొన‌సాగ‌నుంది. ఈ వివ‌రాల‌ను ఆ జిల్లా ఎస్పీ మంగ‌ళ‌వారం సాయంత్రం వెల్ల‌డించారు. 

భజరంగ్ దళ్ (Bajrang Dal) కార్యకర్త హర్ష (harsha) హత్యకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు శివమొగ్గ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ బీఎం లక్ష్మీ ప్రసాద్ (BM Laxmi Prasad) తెలిపారు. మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. 

ఫిబ్రవరి 20వ‌ రాత్రి 28 ఏళ్ల యువకుడిని ప‌లువురు హ‌త్య చేశార‌ని ఎస్పీ బీఎం లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. ఈ ఘ‌ట‌న‌తో సంబంధం ఉన్న ఆరుగురు నిందితులను అరెస్టు చేశామ‌ని ఆయ‌న చెప్పారు. ‘‘ మేము ఈ కేసులో మహ్మద్ కాషిఫ్ (Mohammed Kashif), సయ్యద్ నదీమ్ (Syed Nadeem), ఆషిఫుల్లా ఖాన్ (Ashifullah Khan), రెహన్ ఖాన్ (Rehan Khan), నేహాల్ (Nehal), అబ్దుల్ అఫ్నాన్‌ (Abdul Afnan)లను అరెస్టు చేశాం. ఇందులో కాశీమ్ కు 32 సంవ‌త్స‌రాలు ఉంటాయి. మిగిలిన అంద‌రూ 20 నుంచి 22 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. వారంతా శివమొగ్గ ప్రాంతానికి చెందిన‌వారు ’’ అని ఆయ‌న చెప్పారు.

ఈ కేసులో మరో 12 మందిని అదుపులోకి తీసుకుని విచారించినా ఏమీ తేలలేదని శివమొగ్గ ఎస్పీ తెలిపారు.హర్ష హత్య వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు ప్రతి నిందితుడిని విడివిడిగా విచారిస్తామని ఆయ‌న తెలిపారు. షాపు దగ్గర హర్షపై దాడి జ‌రిగింద‌ని వివ‌రించారు. ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పాఠశాలలు, కళాశాలలు మూసి ఉంచాలని కోరారు.

హర్ష హత్య తరువాత నగరంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంద‌ని, దీనిని కంట్రోల్ లో ఉంచేందుకు ఫిబ్రవరి 25, 2022 తేది ఉద‌యం వ‌ర‌కు క‌ర్ఫ్యూ విధిస్తున్నామ‌ని ఎస్పీ చెప్పారు. హత్యానంతరం శివమొగ్గలో వివిధ దహన, హింసాత్మక ఘటనలు జరిగాయని అన్నారు. ఈ ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. పోలీసులు ఇప్పటికే ఈ ఘ‌ట‌నల విష‌యంలో మూడు కేసులు పెట్టారని ఆయన తెలిపారు.

భ‌జ‌రంగ్ ద‌ళ్ కార్య‌క‌ర్త హర్ష హత్యపై రాష్ట్రంలో రాజకీయంగా పెను దుమారం చెలరేగింది. ఈ హత్యకు కర్ణాటకలో కొనసాగుతున్న హిజాబ్ (hijab) వివాదానికి సంబంధం ఉందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆర్.అశోక ( Revenue Minister R Ashoka) తెలిపారు. హిజాబ్ వివాదం ప్రారంభమైన స‌మ‌యంలో ఈ హత్య జరిగింది. ఈ హత్యకు హిజాబ్ వివాదానికి లింక్ ఉందని స్పష్టంగా తెలుస్తోంది మంత్రి ఆర్.అశోక చెప్పారు. 

విశ్వహిందూ పరిషత్ (VHP) బజరంగ్ దళ్ కార్యకర్త హత్యను తీవ్రంగా ఖండించింది. ‘‘ఇస్లామిక్ ఛాందసవాద నాయకులు బహిరంగ ప్రదేశాల్లో CAA, హిజాబ్, నమాజ్ పేరుతో ముస్లిం సమాజంలో వ్యాప్తి చేసిన విషం ఫలితమే ఈ హత్య ’’ అని ఆరోపించింది. 

ఉడిపికి (udipi) చెందిన కొంతమంది ముస్లిం బాలికలు హిజాబ్‌లు ధరించి తరగతులకు హాజ‌ర‌య్యారు. అయితే వారి ప్రవేశం నిరాకరించడంతో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. హిజాబ్ ధరించిన అమ్మాయిలకు వ్య‌తిరేకంగా హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి కాలేజీకి రావడం ప్రారంభించారు. హిజాబ్ వర్సెస్ కాషాయ కండువాల ధోరణి క్రమంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించి కొన్ని విద్యాసంస్థల్లో మతపరమైన ఉద్రిక్తతకు దారితీసింది.