హోటల్‌లోకి దూసుకెళ్లి మహిళల పార్టీని అడ్డుకున్న బజరంగ్ దళ్.. ‘మన సంస్కృతికి వ్యతిరేకం’
కర్ణాటకలో ఓ హోటల్‌లోకి బజరంగ్ దళ్ కార్యకర్తలు దూసుకెళ్లారు. ఆ హోటల్‌లో నైట్ ఔట్ పార్టీ చేసుకుంటున్న లేడీస్‌ను బయటకు వెళ్లిపోవాలని ఆదేశించారు. ఈ పార్టీలు భారత దేశ సంస్కృతికి వ్యతిరేకమైనవని పేర్కొన్నారు.
బెంగళూరు: ఆ హోటల్‌లో సుమారు 80 మంది కలిసి పార్టీ చేసుకుంటున్నారు. అందులో ఎక్కువగా మహిళలే ఉన్నారు. ఇంతలో ఆ హోటల్ ముందుకు బజరంగ్ దళ్ నేతలు వచ్చారు. ఆ హోటల్‌లోకి దూసుకెళ్లి వారి పార్టీని అడ్డుకున్నారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని, ఇలా రాత్రిళ్లు మహిళలు పార్టీ చేసుకోవడం మన సంస్కృతికి వ్యతిరేకం అని అన్నారు. దీంతో వారంతా గొడవ జరుగుతుందని భావించి వెళ్లిపోయారు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
మార్చి 17వ తేదీన శివమొగ్గ జిల్లాలో క్లిఫ్ ఎంబసీ హోటల్‌లో ఈ ఘటన జరిగింది. క్లిఫ్ ఎంబసీ హోటల్‌లో లేడీస్ నైట్ ఔట్ పార్టీ చేసుకుంటున్నారు. ఇంతలో రాజేశ్ గౌడ నేతృత్వంలో బజరంగ్ దళ్ నేతలు లోనికి దూసుకెళ్లారు. వెంటనే ఆ కస్టమర్లను అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. ఈ ఘటన గురించి తెలియగానే పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు.
ఆ హోటల్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులకు వారు ఫిర్యాదు చేసినట్టు ఇండియా టుడే పేర్కొంది. అక్కడికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేశారు. కానీ, అలాంటివేమీ జరగలేదని, అందుకు సంబంధించిన ఆధారాలేవీ లభించలేవని పోలీసులు తెలిపినట్టు రిపోర్ట్ చేసింది.
Also Read: రైల్వే స్టేషన్‌లో పోర్న్ క్లిప్.. ఖంగుతిన్న ప్రయాణికులు.. వీడియోలు వైరల్
క్లిఫ్ ఎంబసీ హోటల్ ఫేస్ బుక్ పేజీలో శుక్రవారం రాత్రి లేడీస్ పార్టీ ఆర్గనైజ్ చేస్తున్నట్టు పోస్టు పెట్టిందని బజరంగ్ దేళ్ నేత గౌడ తెలిపారు. ఈ పోస్టు చూసిన తర్వాత తాము ఈ పార్టీని ఆపేయాల్సిందిగా తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వివరించారు. ఇలాంటి కార్యకలాపాలు భారత దేశ సంస్కృతిని నాశనం చేస్తాయని పోలీసులకు చెప్పినట్టు పేర్కొన్నారు.
కాగా, పోలీసులు మాత్రం తాము ఈ పార్టీని అడ్డుకోలేదని స్పష్టం చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తాము జోక్యం చేసుకున్నామని వివరించారు. హోటల్ మేనేజ్‌మెంట్ లేదా.. పార్టీలో ఉన్న మహిళలు తమకు ఫిర్యాదు చేస్తే బజరంగ్ దళ్ కార్యకర్తలపై కేసు నమోదు చేస్తామని వివరించారు.
ఈ హోటల్‌కు మంచి రెప్యుటేషన్ ఉన్నది. ఇటీవలే నరేంద్ర మోడీ శివమొగ్గలో పర్యటించినప్పుడు పీఎంవో స్టాఫ్ సహా ఇతర వీఐపీలు ఇక్కడే బస చేశారు.