Asianet News TeluguAsianet News Telugu

భారత సంస్కృతి, సంప్రదాయాలపై కాంగ్రెస్‌కు ఎందుకు అంత ద్వేషం?.. అమిత్ షా ఫైర్

కొత్త పార్లమెంట్ భవనం  సందర్భంగా  రాజదండం (సెంగోల్) ఇప్పుడు సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఎందుకంటే.. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం రోజున సెంగోల్‌ను ప్రతిష్టించే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నట్లు హోంమంత్రి అమిత్ షా తెలిపారు.

Back Sengol at new Parliament amit shah questions Why does Congress hate Indian traditions and culture so much ksm
Author
First Published May 26, 2023, 12:40 PM IST

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర  మోదీ మే 28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై వివాదం ఏర్పడింది. ఇదిలా ఉంటే.. కొత్త పార్లమెంట్ భవనం  సందర్భంగా  రాజదండం (సెంగోల్) ఇప్పుడు సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. 

ఎందుకంటే.. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం రోజున సెంగోల్‌ను ప్రతిష్టించే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నట్లు హోంమంత్రి అమిత్ షా తెలిపారు. టీష్‌వారు భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటించి అనంతరం అధికారాన్ని మార్పిడి చేయడానికి గుర్తుగా నాటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్‌బాటన్ నుంచి తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ  రాజదండాన్ని అందుకున్నట్టుగా చెబుతున్నారు. మరోవైపు లార్డ్ మౌంట్‌బాటన్, సి రాజగోపాలాచారి, జవహర్‌లాల్ నెహ్రూలు సెంగోల్‌ను బ్రిటిష్ వారు భారతదేశానికి అధికార మార్పిడికి చిహ్నంగా అభివర్ణించినట్టుగా ఎటువంటి డాక్యుమెంట్ ఆధారాలు లేవని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ శుక్రవారం పేర్కొన్నారు.

ఈ పరిణామాల వేళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వరుస పోస్టులు చేశారు. భారతీయ సంప్రదాయాలను, సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంతగా ద్వేషిస్తోందని ప్రశ్నించారు. భారతదేశ స్వాతంత్య్రానికి ప్రతీకగా తమిళనాడుకు చెందిన ఒక పవిత్ర శైవ మఠం పండిట్ నెహ్రూకు పవిత్రమైన సెంగోల్‌ను అందించిందని.. అయితే అది ‘‘వాకింగ్ స్టిక్’’గా మ్యూజియంలోకి నెట్టివేయబడిందని మండిపడ్డారు. 

ఇప్పుడు కాంగ్రెస్ మరో అవమానానికి గురిచేసిందని  ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్ర శైవ మఠం అయిన తిరువడుతురై అధీనం స్వయంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో సెంగోల్ ప్రాముఖ్యత గురించి మాట్లాడిందని.. కాంగ్రెస్ అధిష్టానం చరిత్రను బోగస్ అంటోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వారి ప్రవర్తనపై ఆలోచించుకోవాలని అన్నారు. 

 

ఇక, కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి దాదాపు 25 పార్టీలు హాజరవుతాయని భావిస్తుండగా.. 20 ప్రతిపక్షాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి. ప్రస్తుతం బీజేపీలో నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో 18 పార్టీలు ఉండగా.. ఏడు ఎన్డీయేతర పార్టీలు ఈ వేడుకకు హాజరు కానున్నాయి. బీఎస్పీ,  శిరోమణి అకాలీదళ్, జనతాదళ్ (సెక్యులర్), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), వైఎస్సార్ కాంగ్రెస్, బీజేడీ, టీడీపీలు ఈ వేడుకకు హాజరవుతాయని భావిస్తున్నారు.

ఇక, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బదులుగా కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించాలన్న నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండనున్నట్టుగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీతో సహా పలు విపక్ష పార్టీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios