వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి రేసులో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముందున్నారని ఎంపీ బాబుల్ సుప్రియో అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయుల రేసులో ఆమె ముందున్నారని నిర్వివాదాంశమని, వచ్చే ఎన్నికల్లో ఆమెనే ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.  

కోల్‌కతా: కేంద్ర మాజీ మంత్రి, టీఎంసీ నేత బాబుల్ సుప్రియో కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధానమంత్రి రేసులో ఉన్నారని వివరించారు. ‘మా పార్టీ అధినేత్రి 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు కీలకపాత్ర పోషిస్తాయి. ప్రధానమంత్రి పోస్టు రేసులో ఆమె ముందువరుసలో ఉన్నారనేది నిర్వివాదాంశం’ అని అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జులైలో మంత్రివర్గ ప్రక్షాళన గావించిన సంగతి తెలిసిందే. ఆ ప్రక్షాళనలోనే బాబుల్ సుప్రియో తన కేంద్ర సహాయ మంత్రి పదవిని కోల్పోయారు. అసాన్సోల్ ఎంపీగా మిగిలిపోయారు. అనంతరం ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారని ప్రకటించారు. కానీ, తాజాగా బాబుల్ సుప్రియో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. టీఎసీం జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ, రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రియన్‌లు ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.

ఇటీవలే టీఎంసీ మౌత్ పీస్ జాగో బంగ్లా ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా ఎదగడంలో రాహుల్ గాంధీ దారుణంగా విఫలమయ్యారని పేర్కొంది. అంతేకాదు, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బలమైన ప్రత్యర్థి మమతా బెనర్జీనే అని తెలిపింది. రిపోర్టు ప్రచురితమైన తర్వాత తాజాగా బాబుల్ సుప్రియో ఇదే తరహాలో స్పందించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మమతా బెనర్జీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

అంతేకాదు, ఆయన బీజేపీపై వ్యాఖ్యలు చేశారు. ‘పార్టీ మార్చి నేనేమీ చరిత్ర రాయలేదు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి చాలా మంది బీజేపీలో చేరారు. ఆ పార్టీ సీనియర్ నేతల్లో అసంతృప్తి ఉన్నది. బీజేపీ వారందరినీ ఆ అసంతృప్తి గురించి అడగాలి’ అని సూచించారు.