Babri Masjid: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ స్పెషల్ కోర్టు ఇదివరకు తీర్పునిచ్చింది.
Babri Masjid demolition: ఉత్తరప్రదేశ్ లోని ఆయోధ్య రామ మందిరం-బాబ్రీ మసీదుకు సంబంధించి ఇటీవలే సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించడంతో సంవత్సరాల నాటి సమస్యకు ఫుల్‌స్టాప్ పడినట్టయింది. అయితే, దీనికి సంబంధించి మరోఅంశం ఇప్పుడు తెరమీదకు రావడంతో పాటు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వివరాల్లోకెళ్తే.. అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు వివాదం కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిర్దోషులుగా విడుదలైన వారిపై అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో హాజీ మెహబూబ్, సయ్యద్ అఖ్లాక్ అహ్మద్‌ల తరఫున రివిజన్ రిట్ పిటిషన్ దాఖలైంది. ఆరు నెలల క్రితం కేసు నమోదు కాగా, సోమవారం (జూలై 18న) విచారణ జరగనుంది.
బాబ్రీ కూల్చివేత కేసు మొదట ఫైజాబాద్ జిల్లా రామజన్మభూమి పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. తొలుత దీనిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు విచారణ చేపట్టినా ఆ తర్వాత కేసును సీబీఐకి అప్పగించారు. సుదీర్ఘ విచారణ తర్వాత, లక్నోలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఈ సంఘటన ప్రణాళికాబద్ధంగా కాకుండా ప్రమాదవశాత్తు జరిగినదిగా పరిగణించింది. డిసెంబర్ 1992లో మొఘల్ కాలం నాటి స్మారక చిహ్నాన్ని కరసేవకుల గుంపు ధ్వంసం చేసిన ఘటనలో కోర్టు కుట్ర సిద్ధాంతాలను తోసిపుచ్చింది. అందుకే ఈ కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది.
అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌లో సయ్యద్ అఖ్లాక్ అహ్మద్ తరపున బాబ్రీ మసీదు పక్షంగా ఉన్న హాజీ మెహబూబ్ రివిజన్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సీరియల్ నంబర్ 806. హాజీ మెహబూబ్, ఇతరుల తరపున రఫత్ ఫరూఖీ, నజామ్ జాఫర్, ఖలీక్ అహ్మద్ ఈ కేసును వాదించబోతున్నారు. శివప్రసాద్ శుక్లా వారి వ్యతిరేకుల తరఫున వాడించనున్నారు. బాబ్రీ కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సాధ్వి రితంభర, ప్రస్తుతం ఉన్న రామమందిర ట్రస్ట్ అధ్యక్షురాలు నృత్య గోపాల్ దాస్, ఉమాభారతి, బీజేపీ నేత వినయ్ సింగ్ సహా 32 మంది నిందితులుగా ఉన్నారు. రామ మందిరం ఉద్యమంలో పాలుపంచుకున్న వీరిలో 17 మందికి పైగా మరణించారు. ఇప్పుడు, ఈ రిట్ పిటిషన్‌లో మిగిలిన నిందితులను దోషులుగా నిర్ధారించాలని పిటిషన్ దాఖలు చేయబడింది.
బాబ్రీ కూల్చివేత మొత్తం కేసు
రామమందిర ఉద్యమ సమయంలో బాబ్రీ మసీదు కూల్చివేతపై అప్పటి ఫైజాబాద్ జిల్లా రామజన్మభూమి పోలీస్ స్టేషన్‌లో వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి సహా పలువురు బీజేపీ పెద్ద నేతల పేర్లు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని యూపీ పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేయడంతో సీబీఐ కోర్టులోనే విచారణ జరిగింది. ఆ తర్వాత కోర్టు నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఇది నిజానికి రామమందిరమని, శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించడం కోసం కూల్చివేయడం జరిగిందని హిందూ పక్షం తరపున వాదించారు. దీని తరువాత, సుప్రీంకోర్టు హిందువులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని, గొప్ప శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని నిర్మిస్తున్నారు.
అదే నిర్ణయంలో, మసీదు నిర్మాణానికి ప్రత్యేకంగా 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కూడా సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్య ఆలయ మసీదు వివాదం సద్దుమణిగింది. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్‌లో గొప్ప శ్రీ రామ జన్మభూమి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అయితే, మసీదు కూల్చివేత విషయం ప్రపంచానికి తెలుసునని బాబ్రీ మసీదు కూల్చివేత వ్యాజ్యం హాజీ మెహబూబ్ అన్నారు. మరోసారి ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు చూపిస్తామన్నారు.
