B Sudarshan Reddy: ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితంపై స్పందించిన ఇండియా కూటమి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బీ. సుదర్శన్ రెడ్డి.. ప్రజాస్వామ్య విలువల పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. సీపీ రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

B Sudarshan Reddy : 15వ భారత ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. మంగళవారం (2025 సెప్టెంబర్ 9న) ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రతిపక్ష కూటమి అభ్యర్థి బీ. సుదర్శన్ రెడ్డి స్పందించారు. తనకు అనుకూలంగా ఫలితం రాకపోయినా, ప్రజాస్వామ్య వ్యవస్థపై తనకున్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

“ఇది నాకు ఒక గొప్ప గౌరవం. నా జీవితాన్ని నడిపించిన విలువలు అయిన రాజ్యాంగ నైతికత, న్యాయం, ప్రతి వ్యక్తి గౌరవం కోసం నిలబడే అవకాశం లభించింది. ఫలితం నా వైపు రాకపోయినా, మేము ముందుకు తీసుకెళ్లదలచిన పెద్ద లక్ష్యం నిలకడగా కొనసాగుతుంది” అని రెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రతిపక్షాలకు కృతజ్ఞతలు, రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు తెలిపిన సుదర్శన్ రెడ్డి

ప్రతిపక్ష పార్టీల నాయకులకు తన కృతజ్ఞతలు తెలుపుతూ, వారు తనను సంయుక్త అభ్యర్థిగా నిలబెట్టడం ప్రజాస్వామ్యాన్ని బలపరచిందని సుదర్శన్ రెడ్డి అన్నారు. “విజయం ద్వారానే ప్రజాస్వామ్యం బలపడదు. సంభాషణలు, విభేధాలు, ఎన్నికల్లో పాల్గొనడం ప్రజాస్వామ్యానికి బలం ఇస్తాయి. నేను ఒక పౌరుడిగా సమానత్వం, సోదరత్వం, స్వేచ్ఛ అనే విలువలను కాపాడటానికి కట్టుబడి ఉన్నాను” అని ఆయన తెలిపారు.

అలాగే, రాజ్యాంగం దేశానికి మార్గదర్శక కాంతిగా నిలవాలని ఆకాంక్షించారు. చివరగా, కొత్తగా ఎన్నికైన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు తన శుభాకాంక్షలు తెలిపారు.

ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టబోయే సీపీ రాధాకృష్ణన్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన తన పదవీకాలాన్ని విజయవంతంగా సాగించాలని కోరుకుంటున్నాను : బీ. సుదర్శన్ రెడ్డి

సీపీ రాధాకృష్ణన్ కు 452 మొదటి ప్రాధాన్యత ఓట్లు

భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీసీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. మొత్తం 788 మంది ఎంపీలు ఉన్నప్పటికీ, 767 మంది మాత్రమే ఓటు వేశారు. 98.20 శాతం ఓటింగ్ నమోదైంది.

ఎన్డీయే అభ్యర్థి, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ 452 మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బీ. సుదర్శన్ రెడ్డి 300 ఓట్లు సాధించారు. 15 ఓట్లు చెల్లని వాటిగా నమోదయ్యాయి.

ఈ ఎన్నికలో 13 మంది ఎంపీలు ఓటు వేయలేదు. వారిలో బీజేడీ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీలు, బీఆర్ఎస్ కు చెందిన నలుగురు, శిరోమణి అకాలీదల్ నుంచి ఒకరు, ఒక స్వతంత్ర ఎంపీ ఉన్నారు.