మసీదుల్లో లౌడ్ స్పీకర్లను నిషేదించడం వద్ద ప్రజల నిరుద్యోగ సమస్య తీరిపోతుందా అని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రశ్నించారు. ప్రజలకు ఆహారం లభిస్తుందా అని అన్నారు. ప్రజల మధ్య మత విద్వేశాలు రెచ్చగొట్టేందుకే కొందరు ఈ లౌడ్ స్పీకర్ల వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు.

మ‌హారాష్ట్రలో కొన‌సాగుతున్న లౌడ్ స్పీక‌ర్ల వివాదంపై ఎన్సీపీ నాయ‌కుడు, ఉప ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్ స్పందించారు. ఈ వివాదానికి కార‌ణ‌మైన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేపై తీవ్రంగా మండిప‌డ్డారు. ఠాక్రే పేరు ప్ర‌స్తావించ‌కుండానే విభ‌జ‌న రాజ‌కీయాలు రాష్ట్రంలో మ‌త సామ‌ర‌స్యానికి మంచివి కావ‌ని అన్నారు. 

మసీదుల వద్ద లౌడ్ స్పీకర్లను నిషేధించాలని లేదా మసీదుల దగ్గర హనుమాన్ చాలీసా ను పెద్ద సౌండ్ తో వినిపించాల‌ని ఇటీవ‌ల మహారాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్ ఠాక్రే కోరారు. దీనిపై అజిత్ ప‌వార్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం ద్వారా ఏమి సాధిస్తార‌ని అన్నారు. ప్ర‌జ‌ల‌ను ఇలా రెచ్చ‌గొట్ట‌డం వ‌ల్ల నిరుద్యోగ స‌మ‌స్య ఏమైనా త‌గ్గిపోతుందా అని ప్ర‌శ్నించారు.

అహ్మద్‌నగర్ జిల్లాలోని షిర్డీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజ‌రైన ఉప ముఖ్య‌మంత్రి ప‌వార్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇది షాహు, ఫూలే, అంబేద్కర్‌ల మహారాష్ట్ర అని, ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఒకరిని ప్రసన్నం చేసుకోవడానికి చేసిన ప్రసంగాలను భరించద‌ని తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు శాంతియుతంగా జీవిస్తున్నారని, అయితే కొంతమంది మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తిస్తూ సమాజంలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.

‘‘ కమ్యూనిటీలు, మతాల మధ్య చీలికలను అనుమతించకుండా మేము సమాజంలో మత సామరస్యాన్ని చెక్కుచెదరకుండా ఉంచగలిగాము. కానీ కొన్ని పార్టీల నాయకులు లౌడ్ స్పీకర్లను (హనుమాన్ చాలీసా వినిపించేందుకు) అమర్చడానికి ప్రయత్నిస్తున్నారు.’’ అని అన్నారు. ఇలాంటి ప్రకటనలు చేసే వ్యక్తులు మహారాష్ట్రను, దేశాన్ని ఎటువైపు నడిపిస్తారో ఆత్మపరిశీలన చేసుకోవాలని ఠాక్రే పేరును ప్రస్తావించకుండా పవార్ అన్నారు.

‘‘ ఇంకా ఇతర సమస్యలే లేవా ? ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా ప్రజల రొట్టె, వెన్న సమస్య పరిష్కారం అవుతుందా ? COVID-19 మహమ్మారి సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన యువకులకు తిరిగి ఉద్యోగాలు లభిస్తాయా? ’’ అని ఆయ‌న సూటిగా ప్ర‌శ్నించారు. 

ఇదిలా ఉండ‌గా పూణెలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన కు చెందిన మాజీ కార్పొరేటర్ వసంత్ మోర్ లౌడ్ స్పీకర్ల విష‌యంలో రాజ్ ఠాక్రే ఆదేశాల‌పై అభ్యంతరాలు లేవనెత్తారు. తాను పార్టీ హైకమాండ్ ఆదేశాలను పాటించాల్సి ఉన్నప్పటికీ, ఒక ప్రజాప్రతినిధిగా ఆలోచిస్తే ఇది స‌రైంది కాద‌ని అనిపిస్తుంద‌ని అన్నారు. తన వార్డులోని మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించడం తనకు అసౌకర్యంగా ఉంటుందని అన్నారు. ఆయ‌న ప్ర‌స్తుతం పూణే MNS అధ్యక్షుడుగా ఉన్నారు.

కాగా అజాన్ వివాదం క‌ర్ణాట‌క‌లో కూడా కొన‌సాగుతోంది. మ‌సీదుల్లోని లౌడ్ స్పీక‌ర్ల వ‌ల్ల చాలా మంది వృద్దుల‌కు, చిన్న‌పిల్ల‌ల‌కు, చ‌దువుకునే విద్యార్థుల‌కు, హాస్పిటల్ లో ఉన్న రోగుల‌కు ఇబ్బంది క‌లుగుతోంద‌ని అక్క‌డి రైట్ వింగ్ సంస్థ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ‌లు పోలీసుల‌కు పోలీసుల‌కు విన‌తిప‌త్రాలు అంద‌జేశాయి. మ‌సీదుల్లోని లౌడ్ స్పీక‌ర్ల నుంచి సౌండ్ త‌గ్గించాల‌ని కోరాయి. దీంతో పోలీసులు స్పందించారు. ఒక్క బెంగ‌ళూర్ లోనే దాదాపు 200-250 మ‌సీదుల‌కు నోటీసులు జారీ చేశారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం మాత్ర‌మే వాల్యూమ్ ఉంచాల‌ని కోరారు. శ‌బ్ద కాలుష్య నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌కూడ‌ద‌ని సూచించారు. దీంతో పాటు సౌండ్ ను కొలిచే ప‌రిక‌రాల‌ను కూడా అమ‌ర్చ‌డం ప్రారంభించారు.