చట్టం కంటే మతం పెద్దది కాదని, దీనిని ముస్లింలు అర్థం చేసుకోవాలని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే అన్నారు. ముస్లింల ప్రార్థనపై తనకు వ్యతిరేకత లేదని అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కొంత కాలంగా మహారాష్ట్రలో మసీదుల లౌడ్ల స్పీకర్ల విషయంలో గొడవ జరుగుతోంది. ఈ గొడవకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే ఆజ్యం పోశారు. మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలని, లేకపోతే ఆ మసీదుల ఎదుట హనుమాన్ చాలీసా ప్లే చేస్తామని ఇటీవల ఆయన వ్యాఖ్యానించారు. ఈ వాఖ్యలు మహారాష్ట్రలో దుమారాన్ని రేపాయి. ఆ రాష్ట్రంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.
ఇదే విషయంపై మళ్లీ తాజాగా రాజ్ ఠాక్రే వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మసీదుల నుండి లౌడ్‌స్పీకర్లను తొలగించాలనే డిమాండ్ తన ముస్లింల ప్రార్థనల వ్యతిరేకత నుండి ఉద్భవించలేదని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ఎలాంటి అల్లర్లూ జరగడం తమ పార్టీకి ఇష్టం లేదని థాకరే అన్నారు.
“ మాకు మహారాష్ట్రలో అల్లర్లు అక్కర్లేదు. ప్రార్థనలు చేయడాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు. కానీ మీరు (ముస్లింలు) లౌడ్‌స్పీకర్‌లో ప్రార్థన చేస్తే, మేము కూడా దాని కోసం లౌడ్‌స్పీకర్లను ఉపయోగిస్తాము. చట్టం కంటే మతం పెద్దది కాదని ముస్లింలు అర్థం చేసుకోవాలి. మే 3 తర్వాత ఏం చేయాలో చూస్తాను’’ అని రాజ్ థాకరే అన్నారు.
ఇటీవల ఆయన గుడి పడ్వా ర్యాలీ సందర్భంగా రాజ్ సందర్భంగా ఈ విషయంలో మాట్లాడారు. రాష్ట్రంలో మే 3వ తేదీ నాటికి మసీదుల్లో లౌడ్ స్పీకర్లను మూసివేయాలని ఆయన రెండో సారి అల్టిమేటం జారీ చేశారు. ఈ ప్రకటన తరువాత మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఠాక్రేపై బలంగా విమర్శించింది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మహారాష్ట్రలో రాజ్ థాకరే పాత్రను ఉత్తరప్రదేశ్‌లో అసదుద్దీన్ ఒవైసీతో పోల్చారు.
‘‘ మహారాష్ట్రలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు జరిగాయి. కానీ ఇక్కడి ప్రజలు, పోలీసులు శాంతియుతంగా ఉన్నారు. కొందరు వ్యక్తులు ‘కొత్త ఒవైసీ’... ‘హిందూ ఒవైసీ’ ద్వారా రాముడు, హనుమంతుల పేరుతో అల్లర్లు రెచ్చగొట్టే లక్ష్యంతో ఉన్నారు.. మేం గెలిచాం. అలా జరగనివ్వం ” అని రౌత్ ఆదివారం అన్నారు. శ్రీరాముడి పేరుతో మతపరమైన మంటలను రేకెత్తించడం అంటే రాముడి ఆలోచనని అవమానించడమేనని ఆయన అన్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో జరిగిన పరిణామాలపై రాముడు అశాంతిగా ఉంటారని, అక్కడ రామ నవమి రోజున మత ఘర్షణలు కర్ఫ్యూ విధించడానికి దారితీసిందని సంజయ్ రౌత్ అన్నారు. ఆయన తన వీక్లీ కాలమ్ ‘‘రోఖ్‌థోక్’’లో ఇలా రాశారు. ‘‘ ఎవరైనా ఫండమెంటలిజం మంటలను రేకెత్తించాలని, ఎన్నికలలో గెలవడానికి శాంతిభద్రతలకు భంగం కలిగించాలని కోరుకుంటే, వారు రెండో విభజనకు విత్తనాలు వేస్తారు ’’ అని పేర్కొన్నారు.
ఏప్రిల్ 10వ తేదీన రామ నవమి రోజున దేశంలోని వివిధ ప్రాంతాల్లో మత ఘర్షణలను ప్రస్తావిస్తూ.. ఇది మంచి సంకేతం కాదని రౌత్ తెలిపారు. ‘‘ ఇంతకు ముందు రామనవమి ఊరేగింపులు సంస్కృతి, మతానికి సంబంధించినవి. కానీ ఇప్పుడు కత్తులు దూసి మత విద్వేషాలు సృష్టిస్తున్నాయి. హింసాత్మకంగా మసీదుల బయట రక్కులు సృష్టించబడుతున్నాయి ’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
