దేశంలో నెలకొన్న అతి ముఖ్యమైన సమస్యలను నుంచి ప్రజలను మాట్లాడుకోకుండా చేసేందుకే బీజేపీ లౌడ్ స్పీకర్ల వివాదాన్ని మొదలు పెట్టిందని తేజస్వీ యాదవ్ తీవ్రంగా ఆరోపించారు. భారత్ ఇప్పుడు ద్రవ్యోల్బణం, ఉపాధిలేమితో కొట్టుమిట్టాడుతోందని తెలిపారు. 

దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి తీవ్రమైన సమస్యలపై నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే లౌడ్ స్పీకర్ల వివాదం తెరపైకి తీసుకొచ్చారని బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్జేడీ నాయ‌కుడు తేజ‌స్వీ యాదవ్ అన్నారు. ప్ర‌స్తుతం దేశంలో లౌడ్ స్పీక‌ర్ల‌పై, బుల్డోజర్లపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఆదివారం ఆయ‌న బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. 

లౌడ్ స్పీక‌ర్న‌లు 1925లో కనిపెట్టారని, భారతదేశంలోని దేవాలయాలు, మసీదుల్లో దీని వినియోగం 1970వ దశకంలోనే ప్రారంభమైందని తేజ‌స్వీ యాద‌వ్ చెప్పారు. లౌడ్‌స్పీకర్లు లేని సమయంలో దేవుడు, ఖుదా లేరా ? అని ప్ర‌శ్నించారు. లౌడ్‌స్పీకర్లు లేనప్పుడు కూడా ప్రార్థనలు, భజనలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. మతం, కర్మ సారాంశాన్ని అర్థం చేసుకోని వ్య‌క్తులు అనవసరమైన అంశాలకు మతం రంగు వేస్తారని అన్నారు. స్వీయ స్పృహ ఉన్న వ్యక్తి ఈ సమస్యలకు ఎప్పటికీ ప్రాముఖ్యత ఇవ్వ‌బోర‌ని తెలిపారు. 

‘‘ లౌడ్ స్పీకర్లు, బుల్డోజర్లపై చర్చ జరుగుతోంది. కానీ ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతులు, కూలీల సమస్యలపై ఎవ‌రూ మాట్లాడటం లేదు. నిజమైన ప్రజా ప్రయోజనాల విషయంలో కాకుండా ఇత‌ర విష‌యాల‌పై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి ఎవరికి అందడం లేదు. యువత జీవితాలు నాశనం అవుతున్నాయి. దీనిపై చర్చ ఎందుకు జరగడం లేదు? ’’ అని తేజస్వీ యాదవ్ ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…

ఈ లౌడ్ స్పీక‌ర్ల వివాదాన్ని మ‌హారాష్ట్ర‌లో న‌వ నిర్మాన్ సేన పార్టీ అధినేత రాజ్ ఠాక్రే మొద‌లు పెట్టారు. ఆజాన్ సమయంలో మసీదుల నుండి స్పీకర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. మే 3వ తేదీలోగా వీటిని తొల‌గించ‌క‌పోతే మ‌సీదుల వెలుప‌ల హ‌నుమాన్ చాలీసా పారాయాణం చేస్తామ‌ని తెలిపారు. ఇది మ‌హారాష్ట్ర‌తో పాటు దేశ వ్యాప్తంగా దుమారాన్ని రేపింది. క‌ర్ణాట‌క లో కూడా దీని ప్ర‌భావం క‌నిపించింది. ఈ విష‌యంలో మ‌హారాష్ట్ర సంకీర్ణ ప్ర‌భుత్వంలోని నాయకులు ప‌లు మార్లు మాట్లాడారు. 

కాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాధ్ ఈ విష‌యంలో ఓ నిర్ణ‌యం తీసుకున్నారు. కోర్టు ఆదేశాల ప్ర‌కారం అన్ని మ‌త‌రమైన సంస్థ‌ల్లో నిబంధ‌న‌ల మేర‌కే లౌడ్ స్పీక‌ర్ల‌ను ఉప‌యోగించాల‌ని ఉత్త‌ర్వులు జారీ చేశారు. దీని ప్ర‌కారం ఆ రాష్ట్రంలో లౌడ్ స్పీక‌ర్ల‌ను తొల‌గించే ప్ర‌క్రియ‌ను ఇటీవ‌లే మొద‌లు పెట్టారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు మతపరమైన ప్రదేశాల నుండి దాదాపు 11,000 లౌడ్ స్పీకర్లను తొలగించినట్లు సమాచారం.

అయితే మతపరమైన ప్రదేశాల నుండి లౌడ్ స్పీకర్లను తొలగించే విష‌యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడారు. మతపరమైన విషయాలలో తాను జోక్యం చేసుకోనని చెప్పారు. ఈ విష‌యంలో త‌న స్టాండ్ స్పష్టంగా ఉందని అన్నారు. ‘‘ ప్రతి ఒక్కరికీ మా అభిప్రాయం ఏంటో తెలుసు. మేము ఏ మతంలోనూ ఎలాంటి జోక్య‌మూ చేసుకోము ’’ అని నితీష్ కుమార్ తెలిపారు.