కర్ణాటక లో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. మసీదుల్లోని లౌడ్ స్పీకర్ల వల్ల శబ్ద కాలుష్యం జరుగుతోందంటూ, వీటి వల్ల చాలా మందికి ఇబ్బంది కలుగుతోందంటూ రైట్ వింగ్ సంస్థలు పోలీసులకు వినతిపత్రాలు అందజేశాయి. దీంతో అనుమతి ఉన్నంత వరకు మాత్రమే సౌండ్ పెట్టాలని కోరుతూ మసీదులకు పోలీసులు నోటీసులు అందజేశారు. 

కర్ణాటకలోని మసీదులు శ‌బ్ద‌కాలుష్య నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌కూడ‌ద‌ని పోలీసులు కోరారు. ఈ మేర‌కు బుధ‌వారం రాష్ట్రంలోని ప‌లు మ‌సీదుల‌కు నోటీసులు అంద‌జేశారు. లౌడ్ స్పీకర్లను అనుమతించిన‌ డెసిబెల్స్ స్థాయిలోనే ఉప‌యోగించాల‌ని కోరారు. 

మ‌సీదుల నుంచి వ‌చ్చే సౌండ్ వ‌ల్ల.. ఆ మ‌సీదు చుట్టుప‌క్క‌ల ప్రాంతాలలో నివసించే ప్రజలకు భంగం కలుగుతోంద‌ని, అలాంటి లౌడ్ స్పీకర్లను మూసివేయాలని డిమాండ్ చేస్తూ రైట్-వింగ్ సంస్థలు ప్రచారాన్ని ప్రారంభించిన త‌రువాత ఈ ప‌రిణామం చోటు చేసుకుంది. బెంగ‌ళూరులోనే దాదాపు 250 మసీదులకు ఇలాంటి నోటీసులు అందాయ‌ని పీటీఐ క‌థ‌నం పేర్కొంది. దీంతో పాటు ఆయా మ‌సీదుల్లో సౌండ్ ను కొలిచే ప‌రిక‌రాల‌ను అమ‌ర్చ‌డం ప్రారంభించారు. 

మతపరమైన సంస్థలు, పబ్బులు, నైట్‌క్లబ్‌లు, ఇతర సంస్థలు ఎవీ కూడా శబ్ద కాలుష్య నిబంధనలను ఉల్లంఘించకుండా త‌నిఖీలు చేపట్టాల‌ని కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ప్రవీణ్ సూద్ ఇప్పటికే అన్ని పోలీసు కమిషనర్లు, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, పోలీసు సూపరింటెండెంట్‌లకు ఆదేశాలు జారీ చేశారు. 

అంత‌కు ముందు ప‌లు రైట్ వింగ్ సంస్థ‌లు ఇదే విషయంలో పోలీసులు అధికారుల‌కు విన‌తిప‌త్రాలు అంద‌జేశాయి. ఆసుపత్రులు, ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు వంటి నిశ్శబ్ద ప్రాంతాలలో కూడా మ‌సీదులో ఉండే లౌడ్ స్పీక‌ర్ల నుంచి శ‌బ్దాలు వ‌స్తున్నాయ‌ని, వాటిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. మసీదుల్లో లౌడ్‌స్పీకర్‌లు పెట్టడం వల్ల ఉదయం నిద్రకు భంగం కలుగుతోందని, విద్యార్థులు, రోగులు, వృద్ధులు, రాత్రి పని చేసే వారికి అసౌకర్యం కలుగుతోందని ఆ విన‌తిప‌త్రాల్లో తెలిపారు.

దీంతో డీజీపీ ఆదేశాల మేరకు బెంగళూరు పోలీసులు మసీదులకు నోటీసులు జారీ చేయడం ప్రారంభించారు. బెంగళూరులోని జామా మసీదు ఖతీబ్-ఓ-ఇమామ్ మక్సూద్ ఇమ్రాన్ మాట్లాడుతూ.. బెంగళూరులోని మసీదులకు బెంగళూరు నగర పోలీసులు నోటీసులు అందించిన తర్వాత ఆయా లౌడ్ స్పీక‌ర్ల‌లో సౌండ్ ను కొలిచే ప‌రిక‌రాలు అమర్చ‌డం ప్రారంభించార‌ని చెప్పారు. ఇలా న‌గ‌రంలో దాదాపు 200 నుంచి 250 మసీదులకు నోటీసులు అందాయ‌ని తెలిపారు. మేము ధ్వని స్థాయిని ఉల్లంఘించ‌మ‌ని చెప్పారు. సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను పాటించాల్సిన అవసరం ఉంది ”అని ఇమామ్ పీటీఐకి వివ‌రించారు. 

గత కొద్ది నెలలుగా కర్ణాటక రాష్ట్రం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో హిజాబ్ అంశం మొద‌టి సారిగా తెర‌పైకి వ‌చ్చింది. ఇది దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. విదేశాల్లో కూడా దీని ప్ర‌కంప‌న‌లు క‌నిపించాయి. ఆ రాష్ట్ర హైకోర్టు దీనిపై ఇచ్చిన తీర్పుపై కూడా భిన్నాభిప్రాయ‌లు వెలువ‌డ్డాయి. ఇది వివాదం కొన‌సాగుతూనే ఉంది.

కొంత కాలం త‌రువాత మ‌ళ్లీ హ‌లాల్ అంశం కూడా క‌ర్ణాట‌క‌లో తెర‌పైకి వ‌చ్చింది. దీనిపై కూడా ఆ రాష్ట్రంలో చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌ళ్లీ ఇప్పుడు కొత్త‌గా లౌడ్ స్పీక‌ర్ల విష‌యంలో వార్త‌ల్లో నిలుస్తోంది. మ‌సీదుల్లో లౌడ్ స్పీక‌ర్ల స‌మ్య‌స్యపై మ‌హారాష్ట్రలోనూ చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షడు రాజ్ ఠాక్రే ఈ విష‌యంలో మొద‌ట‌గా వ్యాఖ్య‌లు చేశారు. మ‌సీదుల్లో లౌడ్ స్పీక‌ర్లు తీసేయాల‌ని అన్నారు. అలా చేయ‌క‌పోతే మ‌సీదుల ఎదుట హనుమాన్ చాలీసాను వినిపిస్తామ‌ని తెలిపారు. ఈ వ్యాఖ్య‌లు వివాద‌స్ప‌ద‌మ‌య్యాయి.