లౌడ్ స్పీకర్ల విషయాన్ని అడ్డుపెట్టుకొని మహారాష్ట్రలో బీజేపీ అలజడి సృష్టించాలని చూస్తోందని శివసేన సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ ఆరోపించారు. లౌడ్ స్పీకర్ల వివాదంపై చర్చించేందుకు ఆ పార్టీని ఆహ్వానించినా.. సమావేశానికి రాలేదని అన్నారు. 

శివ‌సేన సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ ఎంపీ బీజేపీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆ పార్టీ మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్ల విషయంలో అల‌జ‌డి సృష్టించాల‌ని భావిస్తోందని అన్నారు. ‘ హింస ఎవరికీ ప్రయోజనం చేకూర్చదు’ అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను ఆయ‌న ప్ర‌స్తావించారు. ఈ ఆలోచనను దేశవ్యాప్తంగా చర్చించాలని రౌత్ అన్నారు.

‘లౌడ్ స్పీకర్లకు సంబంధించి కోర్టు ఆదేశాలను పాటించాలని మహారాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీని కోసం రాష్ట్ర హోం మంత్రి సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని పార్టీలను పిలిచారు. కానీ బీజేపీ దానిని వ్యతిరేకించింది. అంటే ఆ పార్టీ రాజకీయాలు చేయాలనుకుంటోంద‌ని, లౌడ్ స్పీకర్ల విషయంలో అలజడి సృష్టించాలని చూస్తోంద‌ని అర్థమ‌వుతోంది ’ అని సంజయ్ రౌత్ అన్నారు. 

మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతున్న లౌడ్ స్పీకర్ వివాదంపై ఈ నెల ప్రారంభంలో అన్ని పార్టీల సమావేశాన్ని నిర్వహించింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా మసీదులలో లౌడ్ స్పీకర్ల కోసం మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్రాన్ని కోరింది. కాగా ఈ వివాదాన్ని మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే ప్రారంభించారు. మే 3వ తేదీలోగా మ‌సీదుల్లో లౌడ్ స్పీక‌ర్ల‌ను తొల‌గించాల‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి సూచించారు. లేక‌పోతే మ‌సీదుల ముందు హనుమాన్ చాలీసా ప్లే చేస్తాన‌ని హెచ్చ‌రించారు. 

ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రకటన ప‌ట్ల హ‌ర్షం
హింస ఎవరికీ ప్రయోజనం కలిగించదని, అన్ని వర్గాలను ఒకచోట చేర్చి మానవత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంద‌ని ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన ప్ర‌క‌ట‌న ప‌ట్ల సంజ‌య్ రౌత్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇది స్వాగతించ‌ద‌గిన వ్యాఖ్య‌ల‌ని చెప్పారు. దీనిపై దేశ వ్యాప్తంగా చ‌ర్చ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ప్రతి భాషకు దాని స్వంత ప్రాముఖ్యత ఉందని తెలిపారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, గుజరాత్‌తో సహా ప‌లు రాష్ట్రాల్లో రామనవమి, హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా మత ఘర్షణల నేపథ్యంలో ఆర్ఎఎస్ఎస్ చీఫ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

ఈ సంద‌ర్భంగా మోహ‌న్ భ‌గ‌వ‌త్ త‌న ప్ర‌సంగంలో ‘అఖండ భారత్’ ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో చాలా మంది కల సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ అవిభాజ్య భారతదేశం దేశంలోని అందరి కల. ఈ కల ఖచ్చితంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హయాంలో నెరవేరుతుంది’’ అని అన్నారు. మహారాష్ట్రలోని భాంఖేడా రోడ్డులోని కన్వర్రామ్ ధామ్ వద్ద సంత్ కన్వర్రామ్ ముని మనుమడు సాయి రాజేష్లాల్ మొర్దియా ‘గద్దినాషిని’ కార్యక్రమంలో మోహ‌న్ భ‌గ‌వ‌త్ పాల్గొని ఈ వ్యాఖ్య‌లు చేశారు.