Asianet News TeluguAsianet News Telugu

Ayodhya verdict:దేశవ్యాప్తంగా హై అలర్ట్.. భారీ భద్రత నడుమ సుప్రీం

ఈ తీర్పు నేపథ్యంలో రైల్వేశాఖ కూడా అప్రమత్తమైంది. రైల్వేస్టేషన్లు, రైళ్లలో భద్రతను మరింత పెంచారు. ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ సైనికులు, అధికారుల సెలవులను రద్దు చేశారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే యూపీలోని మురాదాబాద్ రైల్వే విభాగం స్టేషన్‌లో భద్రతను కట్టుదిట్టం చేసింది. 

Ayodhya verdict: Security on edge as India gears up for historic SC judgement
Author
Hyderabad, First Published Nov 9, 2019, 9:47 AM IST

వివాదాస్పద అయోధ్య కేసులో శనివారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ రోజు ఉదయం  10గంటల 30 నిమిషాలకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేపథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు  చోట్ల భారీ భద్రత ఏర్పాటు చేశారు. తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టు వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.

 

అయోధ్య కేసు తీర్పును వెలువరించే అవకాశాలు ఉండటంతో ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), స్థానిక నిఘా బృందాల ఉన్నతాధికారులు సహా పలువురు అయోధ్యలో భద్రత చర్యలు చేపడుతున్నారని ఓ అధికారి తెలిపారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఎవరైనా ద్వేషపూరిత సందేశాలు వ్యాప్తిచేస్తున్నారా అనే విషయంపై కూడా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. అయోధ్యలో గతనెల 14 నుంచి అమల్లోకి వచ్చిన 144 సెక్షన్.. వచ్చేనెల 10 వరకు కొనసాగనుంది.

 

ఈ తీర్పు నేపథ్యంలో రైల్వేశాఖ కూడా అప్రమత్తమైంది. రైల్వేస్టేషన్లు, రైళ్లలో భద్రతను మరింత పెంచారు. ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ సైనికులు, అధికారుల సెలవులను రద్దు చేశారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే యూపీలోని మురాదాబాద్ రైల్వే విభాగం స్టేషన్‌లో భద్రతను కట్టుదిట్టం చేసింది. అనుమానితులపై రైల్వే అధికారులు దృష్టి సారిస్తున్నారు. 

అత్యంత సున్నిత ప్రాంతాలుగా పరిగణించే గజియాబాద్, సహరన్‌పూర్ రైల్వే స్టేషన్లలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రైల్వే స్టేషన్లలో వదంతులు సృష్టించేవారిపై నిఘాపెట్టారు. ప్రయాణికులు ఇటువంటి వదంతులు విన్నవెంటనే రైల్వే అధికారులకు తెలియజేయాలని సూచిస్తున్నారు.

 

ఇదిలా ఉండగా.... ఈ తీర్పు విషయమై ప్రధాని మోదీ శనివారం ఉదయం ట్విట్టర్ వేదికగా స్పందించారు.  అయోధ్య కేసులో సుప్రీం కోర్టు ఈ రోజు తీర్పు ఇవ్వనుందని ఆయన చెప్పారు. ఆ తీర్పు ఒకరి విజయం కాదని..  అలా అని ఓటమీ కూడా కాదన్నారు. ఈ తీర్పు భారత దేశ శాంతి, ఐక్యత, సద్భావన, గొప్ప సంప్రదాయాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు.

 

దేశ ప్రజలంతా శాంతి, ఐక్యత, సద్భావనతో మెలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. న్యాయవ్యవస్థ  పట్ల గౌరవాన్ని కాపాడేందుకు సమాజంలోని అన్ని సామాజిక, సాంస్కృతిక సంస్థలు కృషి చేస్తున్నాయి. గతంలో సామరస్యపూర్వక, సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి చేసిన ప్రయత్నాలను అన్ని పార్టీలు స్వాగతించాయి. కోర్టు తీర్పు తర్వాత సమాజంలో శాంతి నెలకొనేలా యావత్ దేశం అంతా కలిసి మెలసి నిలబడాలని పిలుపునిచ్చారు.

కాగా... ఈ తీర్పు నేపథ్యంలో కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్ జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. అలాగే అన్ని రాష్ట్రాల్లోని సున్నిత ప్రాంతాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios