న్యూఢిల్లీ: రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంపై చారిత్రిత్మాక తీర్పు ఇవ్వబోతున్న ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు భద్రత పెంచారు. అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు శనివారం తీర్పు వెలువరించనున్న విషయం తెలిసిందే. 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల బెంచీ అక్టోబర్ 16వ తేదీన వాదనలు ముగిసిన తర్వాత తీర్పును రిజర్వ్ చేశారు. సుదీర్ఘంగా 40 రోజుల వాదోపవాదాలు జరిగాయి. రంజన్ గోగోయ్ తో పాటు మిగతా నలుగురు న్యాయమూర్తులు ఎస్ఎ బోబ్డే, డీఎవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్ అబ్దుల్ నజీర్ అయోధ్య వివాదంపై విచారణ జరిపారు. 

జస్టిస్ గోగోయ్ భద్రతను జడ్ కెటగిరీకి పెంచారు. అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిపైనే వివాదం చోటు చేసుకుంది. అది రాముడి జన్మభూమి అని రైట్ వింగ్ కార్యకర్తలు భావిస్తున్నారు. మొఘల్ చక్రవర్తి బాబర్ 16వ శతాబ్దంలో ఆ స్థలంలో మసీదును నిర్మించారని వారు చెబుతున్నారు 

అయోధ్య వివాదంపై అలాహాబాద్ హైకోర్టు 2010 తీర్పు వెలువరించింది. సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖార, రామ్ లల్లా సమానంగా ఆ భూమిని పంచుకోవాలని ఆ తీర్పు సారాంశం. దాన్ని సవాల్ చేస్తూ 14 పిటిషన్లు దాఖలయ్యాయి. 

అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును ఒకరి విజయంగానూ మరొకరి అపజయంగానూ భావించకూడదని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలనుద్దేశించి చెప్పారు శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని ఆయన ఆయన కోరారు.

పుకార్లను నమ్మవద్దని, శాంతిసామరస్యాలను కాపాడాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రజలను కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడానికి, శాంతిసామరస్యాలను నెలకొల్పడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.