వివాదాస్పద అయోధ్య కేసులో శనివారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ రోజు ఉదయం  10గంటల 30 నిమిషాలకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేపథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. 

అయోధ్య పట్టణంలోని రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదాస్పద భూమిపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. సోమవారం వరకూ కాలేజీలు, పాఠశాలలు, పలు విద్యాసంస్థలు, శిక్షణ సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. తీర్పు నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నివారించేందుకు ఉత్తరప్రదేశ్‌లో అణువణువునా భద్రత కట్టుదిట్టం చేశారు.

AlsoRead Ayodhya Verdict: వివాదం 70 ఏళ్ల వివాదం, వరుస ఘటనలు ఇవీ.......

కేవలం ఉత్తరప్రదేశ్ లోనే కాకుండా కర్ణాటక, జమ్మూకశ్మీర్, మధ్యప్రదేశ్ లో కూడా పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు.  సోమవారం వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యా సంస్థలు ప్రకటించాయి. 
 
రక్షణ దళాలను అత్యవసరంగా తరలించేందుకు అయోధ్య, లక్నోలలో హెలికాఫ్టర్లు, రాష్ట్ర రాజధానిలో ఎయిర్‌క్రాఫ్ట్‌లను సిద్ధంగా ఉంచారు. పరిస్థితులను అదుపులో ఉంచేందుకు డివిజనల్ కమిషనర్లు, ఏడీజీపీ, ఐజీ స్థాయి అధికారులు రాత్రంతా వారి వారి జోన్లలో అందుబాటులో ఉండి భద్రతను పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని, స్థానిక ప్రజలకు రక్షణగా అసాంఘిక శక్తులపై కన్నేసి ఉంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

AlsoRead Ayodhya Verdict... అయోధ్య తీర్పు... ఈ రోజే ఎందుకు..?...
ఇదిలా ఉండగా.... ఈ తీర్పు విషయమై ప్రధాని మోదీ శనివారం ఉదయం ట్విట్టర్ వేదికగా స్పందించారు.  అయోధ్య కేసులో సుప్రీం కోర్టు ఈ రోజు తీర్పు ఇవ్వనుందని ఆయన చెప్పారు. ఆ తీర్పు ఒకరి విజయం కాదని..  అలా అని ఓటమీ కూడా కాదన్నారు. ఈ తీర్పు భారత దేశ శాంతి, ఐక్యత, సద్భావన, గొప్ప సంప్రదాయాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు.

దేశ ప్రజలంతా శాంతి, ఐక్యత, సద్భావనతో మెలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. న్యాయవ్యవస్థ  పట్ల గౌరవాన్ని కాపాడేందుకు సమాజంలోని అన్ని సామాజిక, సాంస్కృతిక సంస్థలు కృషి చేస్తున్నాయి. గతంలో సామరస్యపూర్వక, సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి చేసిన ప్రయత్నాలను అన్ని పార్టీలు స్వాగతించాయి. కోర్టు తీర్పు తర్వాత సమాజంలో శాంతి నెలకొనేలా యావత్ దేశం అంతా కలిసి మెలసి నిలబడాలని పిలుపునిచ్చారు.

కాగా... ఈ తీర్పు నేపథ్యంలో కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్ జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. అలాగే అన్ని రాష్ట్రాల్లోని సున్నిత ప్రాంతాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.