అయోధ్యలోని రామమందిరం తొలి దశ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. 2023 డిసెంబర్ కల్లా ఆలయ నిర్మాణం పూర్తవుతుందని, భక్తులు ఆలయాన్ని దర్శించుకోవచ్చని రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ అధికారులు తెలిపారు.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో లక్నో నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలోని అయోధ్యలో రామ మందిరం తొలి దశ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ తొలిసారిగా రామ మందిర నిర్మాణ పనులను చూపించడానికి మీడియాకు అనుమతినిచ్చింది. ముందుగా ప్రకటించుకున్న డెడ్‌లైన్ 2023 డిసెంబర్‌కల్లా మందిర నిర్మాణం పూర్తవుతుందని ఈ ట్రస్టు సభ్యులు తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భక్తులు మందిరంలోకి వెళ్లడానికి సర్వం సిద్ధం చేయనున్నారు.

Scroll to load tweet…

ఆలయ నిర్మాణం కోసం గట్టి భూమి తగిలే వరకు సుమారు 40 అడుగులు తవ్వి తీశామని, దాన్ని 47 వరుసలు కాంక్రీట్‌తో నింపామని ఎల్ అండ్ టీకి చెందిన ప్రాజెక్ట్ మేనేజర్ వివరించారు. ఒక్కో కాంక్రీట్ లేయర్ ఒక అడుగు మందం ఉన్నదని తెలిపారు. ఇక్కడి పది ఎకరాల భూమిలో మూడు అంతస్తుల రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతేడాది ఆగస్టు 5న శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఈ మందిర నిర్మాణం కోసం నాలుగు లక్షల ఘనపు అడుగుల మార్బుల్, రాతిని రాజస్తాన్ నుంచి తెచ్చి వినియోగించనున్నారు. ఈ ఆలయం గర్భగుడిపై 161 అడుగుల ఎత్తు ఉండనుంది.