న్యూఢిల్లీ: అయోధ్య వివాదం మళ్లీ మెుదటికొచ్చింది. అయోధ్యవివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సుప్రీం కోర్టు ముగ్గురు సభ్యులతో కూడిని మధ్యవర్తుల కమిటీని నియమించింది. అయోధ్య కేసులో మధ్యవర్తుల కమిటీ చేతులెత్తేసింది. వివాదానికి పరిష్కారం చూపడంలో విఫలమైంది. 

అయోధ్య వివాదంపై శుక్రవారం సుప్రీం కోర్టులో కీలక విచారణ జరిగింది. ఈవివాదంపై సుప్రీం కోర్టు కీలక సూచనలు చేసింది. అయోధ్య వివాదంపై సయోధ్య కుదిర్చేందుకు సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన మధ్య వర్తిత్వ కమిటీ విఫలమైందని స్పష్టం చేసింది. 

దాదాపు నాలుగున్నర నెలల పాటు శ్రమించిన కమిటీ హిందూ-ముస్లిం వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపారని తెలిపింది. అయినప్పటికీ ఇరు వర్గాలకీ ఆమోదయోగ్యమైన పరిష్కారం సూచించడంలో కమిటీ విఫలమైందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 

ఇకపోతే అయోధ్యవ వివాదంపై రోజువారీ విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో ఆగస్టు 6 నుంచి తామే రోజువారీ విచారణ చేపడతామని తెలిపింది. ఇకపోతే అయోధ్య వివాదానికి ముగింపు పలికేందుకు ఈ ఏడాది మార్చి 8న సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో మధ్యవర్తిత్వ కమిటీని నియమించింది.  

సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఎఫ్‌.ఎం.ఖలీఫుల్లా, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌, ప్రముఖ సీనియర్‌ న్యాయవాది శ్రీరామ్‌ పంచులను కమిటీలో సభ్యులుగా నియమించింది.  అయితే ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వ ప్రక్రియలో పురోగతి చోటుచేసుకోవడం లేదని, దాన్ని రద్దు చేసి న్యాయస్థానమే విచారణ జరపాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో కొద్దిరోజుల క్రితం పిటిషన్‌ దాఖలైంది. 

ఈ పిటిషన్‌పై జులై 11న విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మధ్యవర్తిత్వ ప్రక్రియలో ఇప్పటి వరకు చోటుచేసుకున్న పురోగతిని తెలియజేస్తూ జులై 18లోగా తమకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. 

అత్యున్నత ధర్మాసంనం ఆదేశాల ప్రకారం మధ్యవర్తిత్వ కమిటీ పురోగతి నివేదిక సమర్పించింది. మధ్యవర్తిత్వ కమిటీ నివేదికను పరిశీలించిన  ధర్మాసనం జులై 31 వరకు మధ్యవర్తిత్వం కొనసాగించి ఆగస్టు 1న నివేదిక ఇవ్వాలని సూచించింది. 

సుప్రీంకోర్టు ఆదేశాలతో జస్టిస్‌ ఖలీఫుల్లా నేతృత్వంలోని కమిటీ గురువారం నివేదికను సీల్డ్‌ కవర్‌లో సమర్పించింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య విషయంలో మధ్యవర్తిత్వ కమిటీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆరోపించింది. 

మధ్యవర్తిత్వ కమిటీ ఇరు వర్గాల మధ్య సామరస్య పరిష్కారం చూపని నేపథ్యంలో రాజ్యాంగ ధర్మాసనమే విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ నెల 6 నుంచి తామే రోజువారీ విచారణ చేపడతామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.