ఆటోడ్రైవర్ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు దేశ రాజధానిలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. గ్రామీణ్ సేవ ఆటో ఒకటి ముఖర్జి నగర్‌లో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో పోలీసులు సదరు ఆటోడ్రైవర్‌ని, అతని కుమారుడిని బయటకు లాగి చితకబాదారు.

బూటు కాలితో తంతూ.. తండ్రి, కొడుకులను రోడ్డు మీద ఈడ్చుకెళ్లారు. దీంతో ఆగ్రహించిన ఆటోడ్రైవర్ పోలీసులపై తిరగబడ్డాడు. అంతేకాకుండా వెంట తెచ్చుకున్న కత్తితో పోలీసుల మీద దాడి చేసేందుకు యత్నించాడు.

ఈ తతంగాన్ని రోడ్డు మీదున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే ఈ వ్యవహారంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తొలుత ఆటోడ్రైవర్‌ పోలీసు వాహనాన్ని ఢీకొట్టాడని... దీంతో అందులో ఉన్న ఇద్దరు అధికారులు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు పోలీసులు అన్యాయంగా తన మీద దాడి చేశారని.. సదరు ఆటోడ్రైవర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. వాస్తవలు ఎలా ఉన్నా ఎక్కువమంది మాత్రం పోలీసుల తీరునే విమర్శిస్తున్నారు.

ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం స్పందించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు దీనికి బాధ్యులను ఓ ఎస్సైని, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.