చెన్నై: తనను ప్రేమించలేదనే నెపంతో ఓ వ్యక్తి ఉన్మాదిగా మారి ముగ్గురిపై కత్తితో దాడి చేశాడు. అంతేకాదు ఇంటిని ధ్వంసం చేశాడు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 తమిళనాడులో తిరునెల్వేలి జిల్లా తిరుక్కురుంగుడిలో రసూల్‌రాజ్‌ (52) మతబోధకుడిగా ఉన్నారు. ఇతని భార్య ఎప్సిబాయ్‌ (52). ఈ దంపతులకు ఐదుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహమై భర్తతో కలసి విదేశాల్లో ఉంటున్నారు. 

వీరి 8నెలల చిన్నారి కుయాన్సీని రసూల్‌ దంపతులు పెంచుతున్నారు. దంపతుల నాల్గో కుమార్తె కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈమెను రోస్మీపురానికి చెందిన శివశంకరన్‌ (25) ప్రేమిస్తున్నానంటూ కొంతకాలంగా వెంటపడుతున్నాడు. 

ఆ యువకుడి తల్లిదండ్రులు పెళ్లి విషయమై రసూల్‌రాజ్‌ను కలుసుకోగా రసూల్‌దంపతులు నిరాకరించారు. దీంతో కక్ష పెంచుకున్న శివశంకరన్‌ శనివారం తెల్లవారుజామున వేట కొడవలి, పెట్రోల్‌ క్యాన్‌తో రసూల్‌రాజ్‌ ఇంట్లోకి వచ్చి రసూల్‌రాజ్, ఎప్సీబాయ్, చిన్నారి కుయాన్సీని నరికాడు.

ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి ఇంటిని తగులబెట్టే ప్రయత్నం చేయగా ఇరుగు పొరుగు రావడంతో పారిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న ముగ్గురిని పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు విడి చింది. 

దంపతులిద్దరూ విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడు శివశంకరన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.