రాంచీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబ్దుల్ మజీద్ ను గుజరాత్ ఉగ్రవాద నిరోధక పోలీసులు అరెస్ట్ చేశారు. 24 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న మజీద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

1997లో గణతంత్ర దినోత్సవం రోజున గుజరాత్, మహారాష్ట్రలో పేలుళ్లకు దావూద్ ఇబ్రహీం పన్నిన కుట్రలో మజీద్ భాగస్వామిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.

మజీద్ పాకిస్తాన్ నుండి అక్రమంగా ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తున్నాడని ఏటీఎస్ పోలీసులు తెలిపారు. నిందితుడిని విచారించేందుకు పోలీసులు గుజరాత్ కు తరలిస్తున్నారు. 

2019 మే నుండి జార్ఖండ్ రాష్ట్రంలోని  భారీనగర్ లో  మజీద్ నివాసం ఉంటున్నాడని పోలీసులు చెప్పారు. మహ్మద్ కమల్ పేరిట నకిలీ భారతీయ పాస్‌పోర్ట్ పై ఆరోపణలు ఎదుర్కొంటున్న మలేషియాలోని కౌలాలంపూర్ నుండి భారత్ కు తిరిగి వచ్చిన తర్వాత 2019 మే నుండి జంషెడ్ పూర్ లోని భారీనగర్ లో నివాసం ఉంటున్నట్టుగా ఎటీఎస్ అధికారులు తెలిపారు.

1996 డిసెంబర్ 23వ తేదీన రాజస్థాన్ లోని అజ్మీర్ నివాసి మహ్మద్ ఫజల్ పఠాన్ ను  పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుండి  హైవేపై ఒక చెక్‌పోస్ట్ వద్ద నాలుగు కిలో గ్రాముల పేలుడు పదార్థాలు, 125 ఆటోమెటిక్ పిస్టల్స్ స్వాధీనం చేసుకొన్నారు. దావూద్ ఇబ్రహీం, అబూ సలేం ఆదేశాల మేరకు 1997 జనవరి 26వ తేదీన ఉగ్రవాది దాడి కోసం వీటిని సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు.